హైదరాబాద్ : దేశంలోని ఎనబై కోట్ల మంది బీసీల జీవితాలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెలగాటమాడుతుందని, పేరుకు కులగనన చేస్తున్నామని చెప్తూనే కులగణన ప్రశ్నావళిలో బీసీ కాలం చేర్చకుండా, ప్రతి కులానికి యూనికోడ్ కేటాయించకుండా బీసీలను నమ్మించి వంచిస్తుందని, ఇదే వైఖరి అవలంబిస్తే దేశంలోని బీసీలు ఒక్కటై బిజెపిని గద్దె దించడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా హెచ్చరించారు . ప్రస్తుతం జరుగుతున్న జాతి జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు . హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు . బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, టిఆర్ఎస్ శాసనసభా పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ కుమార్ తో పాటు 80 కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేని జాతి జనగణను తక్షణమే నిలిపి వేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 40 ప్రశ్నలతో ఇచ్చిన గెజిట్ ను రద్దుచేసి జాతీయస్థాయిలో అఖిలపక్ష పార్టీలు, సామాజిక నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే జనగణన ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు
దేశంలోని బీసీ సమాజమంతా బీసీ లెక్కలు కావాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించాలని ఉద్యమిస్తుంటే బీసీ ప్రధాని అయి ఉండి కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని, బిజెపి బీసీలు ద్రోహుల పార్టీగా వ్యవహరిస్తుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు, బీసీ కులగన చేపట్టని బిజెపి నాయకులకు బీసీ బీసీలు అంతా కలిసి పిండ ప్రదానం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు, ఈనెల 20వ తేదీన హైదరాబాదులో బీసీ కులగన్న పై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని ఆ సదస్సులో దేశవ్యాప్తంగా మరో మండల్ ఉద్యమానికి రూపకల్పన చేస్తామని, కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని గల్లి నుంచి ఢిల్లీ వరకు తీవ్రతరం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు . ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ కుమార్ లు మాట్లాడుతూ బీసీ కులగనన చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో వంద రోజులపాటు దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తుందని, వంద రోజుల తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించి బీసీల నిరసన సెగను కేంద్రానికి రుచి చూపిస్తామని హెచ్చరించారు. బీసీ సంఘాలు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు. బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ దేశంలో బీసీలకు నిజమైన స్వాతంత్రం రాలేదని బీసీలను ప్రభుత్వాలు మనుషులుగా కూడా గుర్తించక పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు .
ఆకాశంలో ఉండే నక్షత్రాలను, భూమి జలంలో ఉండే జల రాశులను లెక్కిస్తున్న ప్రభుత్వాలు బీసీలను లెక్కించాలంటే మాత్రం మనసు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు .బీసీలంతా దేశవ్యాప్తంగా దండుగట్టి కేంద్రంపై తిరుగుబాటు చేసి బీసీ కులాల లెక్కలు తీసే వరకు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు .ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ బిజెపి డీఎన్ఏ లోనే రిజర్వేషన్ల వ్యతిరేక భావన ఉన్నదని, బీసీ లెక్కలు తీస్తే బీసీలకు రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం పెంచవలసి వస్తుందని కుట్రతోనే ఆదిలోనే బీసీ లెక్కలు తీయకుండా బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు, బీసీ లెక్కలు తీయని బిజెపిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, బీసీ ద్రోహులుగా ప్రకటించి బిజెపికి బీసీలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు . బీసీ సంఘాలు చేస్తున్న జాతీయ స్థాయి ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుందని ప్రకటించారు.
