భవిష్యత్‌ సాంకేతికతకు కేంద్రం అమరావతి

సాంకేతికతతో సత్వర ప్రగతికి సోపానం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంప్రదాయ ఆరోగ్య విధానాలను కొనసాగిస్తూనే ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకుంటే వైద్యారోగ్య రంగంలో మరింత మెరుగైన సేవలు అందించగలమని అన్నారు. సాంకేతికతను అన్ని రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తే రాబోయే పదేళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించగలదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్‌ సాంకేతికతకు కేంద్రంగా తీర్చి దిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో క్వాంటం బయో వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దీనికి జాతీయ గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్‌ అమరావతిలోనే ప్రారంభం కానుందని తెలిపారు. అమరావతి గురించి లద్దాఖ్‌లోనూ చర్చించుకునే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.

అన్ని ప్రాంతాల్లో అమరావతికి గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లినా అమరావతి గురించి చర్చించుకునే రోజు వస్తుందని చెప్పారు. ఏఐ రంగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండ‌గా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం వేదికపైకి రాగానే వైద్య విద్యార్థులు, సభికులు పెద్దఎత్తున హర్ష ధ్వానాలతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ప్రసంగం సందర్భంగా అడుగడుగునా చప్పట్లతో కళా వేదిక మార్మోగింది. దీంతో సీఎం చంద్రబాబు కూడా అంతే ఉత్సాహంతో స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమరావతి, సంజీవని ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి సీఎం ప్రస్తావించిన ప్రతి సందర్భంలోనూ కళా వేదికలో పెద్ద ఎత్తున చప్పట్లతో సభికులు హర్షధ్వానాలు తెలిపారు. సభ ముగిసిన తర్వాత సభికుల ఆనందోత్సాహాల్లో పాలుపంచుకుంటూ.. వేదిక మీద నుంచే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి సీఎం చంద్రబాబు సెల్ఫీ తీసుకున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!