అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌తోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు వివరించారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకు పోయింది. దీంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.
ఆ ప్రాంతంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట తక్షణమే పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని అన్నారు. అత్యవసర సేవల సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
