న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమావేశం కీలక అంశాలపై చర్చించింది. ప్రధానంగా డాలర్ డామినేషన్ గురించి చర్చకు వచ్చింది. ఇక రెండో రోజు దృఢత్వం, ఆవిష్కరణ, సహకారంపై చర్చించారు. ఈ సమావేశం బ్రిక్స్ నాయకులకు ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించడానికి , సభ్య దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను అన్వేషించడానికి ఒక వేదికగా నిలించింది. శిఖరాగ్ర సమావేశం సందర్భంగా బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, యూఏఈ జాతీయ భద్రతా సుప్రీం కౌన్సిల్ సెక్రటరీ జనరల్ అలీ మొహమ్మద్ హమ్మద్ అల్ షంసీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ అల్-సిసి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ కీలక అంశాలను ప్రస్తావించారు.
భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో, రెండవ రోజున నాయకులు ఒక బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తంలోని కీలక అంశాలైన దృఢత్వం , ఆవిష్కరణ , సహకారం , సుస్థిరత పై దృష్టి సారించారు. ప్రపంచ వృద్ధికి సమ్మిళిత విధానాన్ని ముందుకు తీసుకెళ్తూనే, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించడానికి , సభ్య దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. అంతకు ముందు నిన్న బ్రిక్స్ నాయకులు ఏకగ్రీవంగా ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026’ను ఆమోదించారు. దీని ఫలితాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత పరిధి , బలమైన లక్ష్యం కలిగిన బ్రిక్స్ కు ప్రతిబింబంగా అభివర్ణించారు. ఈ ప్రకటన ఆవిష్కరణ, సుస్థిరత , ప్రజల మధ్య సంబంధాలపై దృష్టి సారిస్తుందని, తద్వారా సహకారాన్ని బ్రిక్స్ దేశాల ఆకాంక్షలకు మరింత ఆచరణాత్మకంగా, అభివృద్ధి ఆధారితంగా ప్రతిస్పందించే విధంగా మార్చడమే దీని లక్ష్యమని అన్నారు.
