సెక్షన్ 22A వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జర‌పాలి

డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ బీజేపీ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సెక్షన్ 22A వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి. అసెంబ్లీలో అధికార పక్షం సభ్యుల నుంచి నిరసనల మధ్య సెక్షన్ 22Aకు సంబంధించిన అంశాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంపై చ‌ర్చ జ‌రిగింది. ఫోరెన్సిక్ నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ అలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22Aకు సంబంధించిన అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మహేశ్వర్ రెడ్డి ‘ధరణి’ పోర్టల్‌ను ప్రస్తుత ‘భూ భారతి’ విధానంతో పోల్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి బదులుగా, కాంగ్రెస్ ప్రభుత్వం సెక్షన్ 22A వివాదంలో ఎందుకు చిక్కుకుందని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రే స్వయంగా లోపాలను అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు, భూములపై సమగ్ర ఆడిట్ ఎందుకు నిర్వహించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

ఈ విషయాన్ని కాగ్ కు నివేదించ లేద‌ని నిల‌దీశారు. తప్పు చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుక‌లేక పోయారో చెప్పాల్సిన బాధ్య‌త స‌ర్కార్ పై ఉంద‌న్నారు. దీనికి స్పందించారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి . ఈ విషయాన్ని కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ కు నివేదించామని, త్వరలోనే ఆడిట్ నివేదికను విడుదల చేస్తామని చెప్పారు. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ప్రత్యేక విచారణ బృందం వద్ద ఉందని, ఆ నివేదికను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చి ప్రజలకు తెలియజేస్తామని ఆయన తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత, దానిపై సభలో చర్చిస్తాం అని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వకితి శ్రీహరి , ఇతర ఎమ్మెల్యేల అభ్యంతరాల మధ్య, 50 లక్షల మంది బలహీన వర్గాల ప్రజలపై ప్రభావం చూపే ఈ అంశంపై విచారణ జరపడానికి అధికార కాంగ్రెస్ భయపడుతోందా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!