’22ఎ’లో 12 ర‌కాల స‌మ‌స్య‌లు గుర్తించాం : సీఎం

మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై సీరియ‌స్ కామెంట్స్

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఫ్యామిలీ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ల‌క్ష కోట్ల విలువ క‌లిన భూముల‌ను కొల్ల‌గొట్టార‌ని ఆరోపించారు. కేసీఆర్ బినామీ మై హోం అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు అని పేర్కొన్నారు శాస‌న స‌భ సాక్షిగా. ఇదే క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన 22ఎ కు సంబంధించి కూడా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం. ఇందుకు సంబంధించి ప్రధానంగా 12రకాల సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం కింద మిగులు భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభుత్వం నూతన విధానాన్ని త్వరలోనే ప్రవేశ పెట్టనుందని వెల్ల‌డించారు. ఈ పథకం పెండింగ్ లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త ధరఖాస్తులన్నింటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో చేపడతాం అన్నారు.

కాంపిటెంట్ అథారిటీచే ఆమోదించబడిన లేఅవుట్లలో పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి, తగిన పరిష్కారం చూపేందుకు వారం రోజుల్లోగా ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తాం అని వెల్ల‌డించారు సీఎం. ఇలాంటి ఆస్తుల క్రమబద్ధీకరణ త్వరగా పూర్తి చేసేందుకు నూతన పథకాన్ని ప్రవేశ పెడతాం అన్నారు. సింగ‌రేణి కాల‌నీస్ కు సంబంధించి జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ పెండింగ్ లో ఉన్న అన్ని దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, నిర్దేశిత అర్హతా ప్రమాణాల మేరకు పరిష్కరిస్తుందన్నారు. జీవో నెం. 59 సమస్యపై స్పందించారు సీఎం. హక్కు బదిలీ పత్రాలు జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను నిర్దేశిత అర్హతల ప్రాతిపదికన తుది పరిశీలన జరిపి క్లియర్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామ‌న్నారు.
మిగిలిన 18,590 పెండింగ్ దరఖాస్తులు నూతన క్రమబద్ధీకరణ విధానం కింద పరిష్కరిస్తామ‌ని తెలిపారు.

జీవో నెం. 118 ఎల్.బి. నగర్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామ‌న్నారు. పరిష్కారమైన అన్ని కేసులను వెంటనే సెక్షన్ 22-A నిషేధిత జాబితా నుండి తొలగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అసైన్డ్ భూములన్నీ తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధ) చట్టం 1977 పరిధిలోకి వస్తున్నందున, ఈ అంశంపై సమగ్ర న్యాయ సమీక్ష జ‌రుపుతామ‌న్నారు. నాలా ఛార్జీలను స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములను కలిపి క్రయవిక్రయాలకు అనుమతిస్తామ‌ని తెలిపారు. ప్రభుత్వ భూములలో ఆక్రమణలు , అనధికార లేఅవుట్లు / కాలనీలకు సంబంధించి నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం. సికింద్రాబాద్ పరిధిలోని లీజ్ హోల్డ్ ఆస్తుల ఫ్రీహోల్డ్ క్రమబద్ధీకరణపై స్పందించారు. ఈ కేసులను పరిష్కరించేందుకు 30 రోజుల నిర్దిష్ట వ్యవధిలోగా అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్మెంట్ భూములు, భూదాన్ భూములకు సంబంధించి పేద, బలహీన వర్గాల గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం భూమిని, ఆర్థిక వనరులను సమీకరించే ఉద్దేశంతో ఈ భూములను సమగ్ర ల్యాండ్ పూలింగ్ విధానం పరిధిలోకి తీసుకొస్తాం అని ప్ర‌క‌టించారు సీఎం.

Leave A Reply

Your Email Id will not be published!