గొడ్డలి పార్టీ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలి

డీఎస్సీ అంటే జగన్ కు డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కర్ గుర్తొస్తాయి

అమ‌రావ‌తి : టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అక్టోబర్, నవంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని కేడ‌ర్ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్ సైడ్ విక్టరీ రావాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ డిఎ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడారు. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు మరింత సేవ చేయగలమని అన్నారు. వైసిపి నాయకులు ఫస్ట్ గ్రేడ్ క్రిమినల్స్ అని ఆరోపించారు. రాజకీయ ముసుగులో కుల,మత విభేదాలు రెచ్చ గొడతారని జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించారు. మనం అప్రమత్తంగా ఉండాలి. వారి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కోడికత్తి డ్రామా చూశాం. సొంత బాబాయిని లేపేసి బాబు చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్తచరిత్ర అని రాశారని పేర్కొన్నారు నారా లోకేష్.

ఇటీవల ఈడి అవినాష్ ను పిలిచింది. ఎన్నికల సమయంలో జగన్ గులకరాయి డ్రామా చూస్తే ఆశ్చర్యమేసింది అని అన్నారు . ప్రతిదీ చంద్రబాబు, లోకేష్ చూసుకోవడం సాధ్యం కాదు. మనకు వారి మాదిరి దొంగ పేపర్లు, టివిలు లేవు. అయితే కోటిమంది కార్యకర్తలు ఉన్నారు. మనమంతా మాట్లాడటం మొదలు పెడితే వారు ఎన్ని రాసినా ప్రజలు నమ్మరని గుర్తించాల‌ని అన్నారు .భారతదేశంలో ఎవరూ ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం, స్త్రీశక్తి కింద ఉచిత బస్సు కల్పిస్తున్నాం. రైతులకు అన్నదాత సుఖీభవ, చేనేతల సేవలో, ఆటోవాలా సేవలో, మత్స్యకారుల సేవలో వంటి పథకాలు అమలు చేస్తున్నాం. 16 వేల టీచర్ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీచేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. గూగుల్, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రాష్ట్రానికి రప్పించాం. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల బండిలాంటివి. వాటిని సమర్థమంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. వైసిపి హయాంలో రోడ్లపై పడిన గుంతలు పూడ్చడానికి 2 వేల కోట్లు ఖర్చయ్యాయి. ప్రజాయ‌ప్రభుత్వం గత రెండేళ్లలో చేసిన మంచి పనులతో పాటు గొడ్డలిపార్టీ కుట్రలను ప్రజలకు తెలియ జెప్పాల్సిన బాధ్యత కేడర్ పై ఉంద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!