ఏపీలో రెడ్ బుక్ పాల‌న కొన‌సాగుతోంది : జ‌గ‌న్

సీఎం చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర ఆగ్ర‌హం

తాడేప‌ల్లి గూడెం : రాష్ట్రంలో టీడీపీ కూట‌మి పాల‌న ప‌క్క‌దారి ప‌ట్టంద‌న్నారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. చంద్ర‌బాబు నాయుడు పాల‌నా ప‌రంగా ఫెయిల్ అయ్యార‌ని మండిప‌డ్డారు. ‘రెడ్‌ బుక్‌ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు. రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) పేరును ఉపయోగించు కోవడం ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు అని పేర్కొన్నారు. చంద్రబాబూ మీ పాలనలో ఇదేనా పోలీసింగ్‌ అంటే? అని నిల‌దీశారు. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా? అని మండిప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి.‘ఎక్స్‌’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమకు తాము అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం అన్నారు. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్యగా పేర్కొన్నారు. పోస్టుల తొలగింపు అభ్యర్థన నిజంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల అధికారిక ఈ–మెయిల్‌ చిరునామా నుంచే వచ్చిందని ‘ఎక్స్‌’ ధృవీకరించిందన్నారు. అయినప్పటికీ, ఆ మెయిల్‌ పంపిన సంబంధిత అధికారి తాను ‘ఎఫ్‌బీఐ’ సంస్థకు చెందిన వ్యక్తిగా చెప్పుకున్నారని పేర్కొన్నారు జ‌గ‌న్ .

అసలు ఆ అభ్యర్థన పంపాలని ఆదేశించింది ఎవరు? అక్కడ ‘ఎఫ్‌బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచి వేసేందుకు, ‘ఎక్స్‌’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశ పూర్వకంగానే ఈ పని చేశారా? అని నిల‌దీశారు. పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించిందే తప్ప, మీ రాజకీయ సెన్సార్‌షిప్‌ను అమలు చేయడానికి కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన పోస్టుల తొలగింపు చర్యలో ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరును వాడటం ఆంధ్రప్రదేశ్‌కు అవమానం కాదా అని ప్ర‌శ్నించారు. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తిన్న‌ద‌న్నారు.విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని, గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీల అమలుకు వినియోగించండి అని హిత‌వు ప‌లికారు జ‌గ‌న్ రెడ్డి. ఇంకా తీవ్ర కరువు పరిస్థితుల్లో మొత్తం నష్టపోయిన రెతులను ఆదుకోవాల‌ని కోరారు. యువతకు ఉద్యోగాలు కల్పించండి. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల‌న్నారు. చాలా వేగంగా వ్యాప్తి చెందిన ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదని గుర్తించాల‌న్నారు. మీ పనితీరుపై మీ ప్రభుత్వానికి అంత నమ్మకం ఉంటే, ప్రజలకు అంతా బాగా చేశామని అనుకుంటే.. అది మీ పనితీరులో చూపాలి. ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్‌షిప్, వేధింపులతో కాద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!