చెన్నై : మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రజాస్వామ్యం అంతరించడం వల్లే ఉప ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆదివారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 6న తమ పార్టీకి ఓటు వేయాలని మధురాంతకం , ధరాపురం నియోజకవర్గాల ఓటర్లను ఆయన కోరారు. ఈ సందర్బంగా అధికార టీవీకే పార్టీకి, దాని కూటమికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం సహజ పరిణామమేనా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా టీవీకే పార్టీ మధురాంతకం , ధరాపురం స్థానాల్లో వరుసగా కె. మరకతం కుమారవేల్, సత్యభామలను అభ్యర్థులుగా బరిలోకి దింపింది. వీరు అన్నాడీఎంకే పార్టీని వీడారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తర్వాత అధికార పార్టీలో చేరారు. వీరిద్దరూ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులుగా గెలిచార.
కాగా పార్టీ ఫిరాయింపులు ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం సిగ్గులేకుండా టీవీకే పార్టీ ఈ రెండు స్థానాల్లోనూ అదే వ్యక్తులను తమ పార్టీ గుర్తు ‘విజిల్’ పై పోటీకి నిలిపిందని డీఎంకే అధినేత స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు ఇది రాజకీయ బేరసారాలు కాదని, కేవలం పరిపాలనాపరమైన చర్య అని అధికార పార్టీ పేర్కొంటోందని స్టాలిన్ తెలిపారు. ఇదేనా వారి సిగ్గులేని మార్పు? అని ఆయన నిలదీశారు. సాధారణంగా శాసనసభ్యుడు మరణించినప్పుడు ఉప ఎన్నిక జరుగుతుందని, కానీ ప్రజాస్వామ్యమే చని పోయినందున ఇప్పుడు ఉప ఎన్నికలు జరగాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
