50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్లు

రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అంద జేయడమే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎటువంటి అక్రమాలు, అవినీతి తావులేకుండా అర్హులైన నేతన్నలందరికీ పెన్షన్లు అందజేసేలా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో నేతన్నల దరఖాస్తుల పరిశీలనలో జరుగుతున్న చేతి వాటంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో సదుద్దేశంతో సీఎం చేనేతలకు ఆర్థిక మేలు కలుగ జేయాలన్న లక్ష్యాన్ని నీరు గార్చుతున్న అధికారులపై కొరడా ఝుళిపించారు. దరఖాస్తుల పరిశీలన పేరుతో పచ్చనోట్లకు కక్కుర్తిపడిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, నేతన్నల సేవలో పథకంపై అమలు తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు.

నూతన పెన్షన్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే దానిపై.వాటి పరిశీలిన గురించి ఆరా తీశారు ఎస్. స‌విత‌. నూతన పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16,521 దరఖాస్తులు వచ్చినట్లు ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటింటికీ వెళ్లి అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84 వేలకుపైగా చేనేతలకు పెన్షన్లు అంద జేస్తున్నామన్నారు. శ్రీసత్యసాయి, అనంతపురం సహా పలు జిల్లాల్లో దరఖాస్తు దారుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు తెలిసిందని సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. చేనేతలందరికీ ఆర్థిక మేలు కలుగ జేయాలన్నది సీఎం , మంత్రి నారా లోకేశ్ లక్ష్యమన్నారు. ఉచిత విద్యుత్, నేతన్నల సేవలో పథకం సహా పలు పథకాలను ఇటీవల ప్రారంభించారన్నారు.ఇపుడు 50 ఏళ్లు నిండిన చేనేతలకు నూతన పెన్షన్లు అందజేయాలని నిర్ణయించారన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!