ఐడీఎల్ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ఏవీ రంగ‌నాథ్ ఆరా

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రం కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు అభివృద్ధి పనులను ప‌రిశీలించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌. గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎత్తైన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీలుగా చెరువు లోతును 25 అడుగులకు పైగా పెంచారు. వేలాది విగ్రహాలు ఐడీఎల్ చెరువులోకి సులభంగా ప్రవేశించేలా ప్రధాన రహదారి వైపు ఏర్పాటు చేసిన భారీ క్రేన్‌లను కూడా హైడ్రా కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనం పూర్తయిన వెంటనే చెరువులో ఉంచిన విగ్రహాలను తొలగించడానికి చేసిన ఏర్పాట్ల గురించి అధికారులు కమిషనర్‌కు వివరించారు. చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నందున, నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కమిషనర్ గతంలోనే ఆదేశించారు. ఆ మేరకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐడీఎల్ చెరువులో పూడిక తీత , నీటి నిల్వ పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నిమజ్జనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం పర్యవేక్షించాలని, సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.

ఐడీఎల్ చెరువును సందర్శించిన అనంతరం సమీపంలోని ఆంజనేయ నగర్ రోడ్డుపై ఉన్న అడ్డంకుల గురించి ‘ప్రజావాణి’లో వచ్చిన ఫిర్యాదుపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఆంజనేయ నగర్ మీదుగా నిర్మాణంలో ఉన్న వైట్‌వాటర్ అపార్ట్‌మెంట్ల పక్కన 100 అడుగుల రోడ్డు ఉన్నప్పటికీ, దానిపై అడ్డంకులు సృష్టిస్తున్నారని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మార్గం ద్వారా ఆంజనేయ నగర్ నుండి కూకట్‌పల్లి రోడ్డుకు సులభంగా చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, రోడ్డుపై ఆక్రమణల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. పైభాగంలో హై-టెన్షన్ విద్యుత్ తీగలు కూడా ఉన్న విషయాన్ని గమనించిన కమిషనర్ రోడ్డుపై ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని, ఆక్రమణలను తొలగించి రోడ్డును పునరుద్ధరించాలని ఆదేశించారు. హై-టెన్షన్ తీగల కింద ఉన్న ప్రధాన రహదారిని ఆక్రమించి, బస్సుల పార్కింగ్ కోసం వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను పరిశీలించి, రోడ్డును పునరుద్ధరించాలని, అలాగే ఈ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న పార్కు ప్రాంతాలను పరిరక్షించాలని ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!