జగన్ రెడ్డి పచ్చి అబద్దాల కోరు : అచ్చెన్నాయుడు
ఎల్‌నినో ముప్పును ముందే గుర్తించాం చర్యలు చేపట్టాం
అమరావతి, : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పచ్చి అబద్దాలకోరు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్దక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రైతులను, పంటలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం శాస్త్రీయ దృక్పథంతో సమగ్ర కార్యాచరణ చేపట్టిందని అన్నారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంటే వాస్తవాలను పక్కనపెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏమీ చేయలేదని జగన్ చెప్పడం పూర్తిగా అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. ఎల్‌నినో ముప్పును ముందుగానే అంచనా వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 2026లోనే ‘జలధార’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారని తెలిపారు.
ముందస్తు ప్రణాళికలు, క్షేత్రస్థాయి చర్యల ఫలితంగానే రాష్ట్రంలో భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరిగాయని వెల్లడించారు. ‘జలధార–జలహారతి’ కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం రూ.3,409.35 కోట్ల వ్యయంతో 79,826 పనులను పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 625 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముందస్తు చర్యలు లేకపోయి ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ బకాయిలను మేమే చెల్లిస్తున్నాం.. పంటల బీమాలో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందన్నారు అచ్చెన్నాయుడు. పంటల బీమా గురించి మాట్లాడే నైతిక అర్హత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఖరీఫ్ సీజన్‌లో కేవలం మూడేళ్లు మాత్రమే పంటల బీమా ప్రీమియం చెల్లించి, రెండు సంవత్సరాలు ప్రీమియం చెల్లించకుండా వదిలేశారని, ఐదేళ్లలో రబీకి ఒక్క ఏడాది కూడా ఇన్యూరెన్స్ కట్టలేని జగన్ ఇప్పుడు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
