అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా దేశంలోనే పంటల బీమా పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రంలో టాప్ లో కొనసాగుతోందని వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ , పశు సంవర్దక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వం బకాయిల భారాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఏర్పడిన ఆర్థిక భారాన్ని భరిస్తూనే రైతులకు పంటల బీమా భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. పంటల బీమాను గాలికి వదిలేశామని విమర్శలు చేస్తున్న జగన్ ముందుగా తన ఐదేళ్ల పాలనలో రైతులకు ఏ మేరకు బీమా రక్షణ కల్పించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశంలోనే పంటల బీమా నమోదులో ఆంధ్రప్రదేశ్ అత్యధిక శాతం నమోదు సాధించిన రాష్ట్రంగా నిలిచిందని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియం నిధులను ముందుగానే ఎస్క్రో ఖాతాలో అందుబాటులో ఉంచామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ముందు చూపుతో తీసుకున్న చర్యల ఫలితంగా తొలిసారిగా సుమారు రూ.16 వేల కోట్ల విలువైన పంటలకు బీమా నమోదు జరిగిందని మంత్రి వెల్లడించారు. రైతులకు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆర్థిక భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు సంక్షేమంపై చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వైసీపీ తన హయాంలో రైతులకు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఫిబ్రవరి 2026 నుంచే కూటమి ప్రభుత్వం ముందస్తు కార్యాచరణను ప్రారంభించిందని తెలిపారు. జూన్–ఆగస్టు కాలంలో సాధారణ వర్షపాతం 350 మి.మీ. కాగా ఇప్పటివరకు 170.9 మి.మీ. మాత్రమే నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో వర్షపాత లోటు 51.2 శాతంగా ఉండగా దేశవ్యాప్తంగా ఇది సుమారు 13 శాతమేనని వివరించారు.
పంట నష్టం జరిగిన తర్వాత స్పందించే విధానానికి భిన్నంగా, శాస్త్రీయ సమాచారం, శాటిలైట్ పర్యవేక్షణ, జలాశయాల నీటి నిల్వలు, నేల తేమ, పంటల పరిస్థితి, విత్తనాలు, సాగు పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ రైతు కేంద్రిత ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రాంతం–రైతు కమతం ఆధారిత వ్యూహం, , నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక, ‘రైతన్న మీ కోసం’ ఎల్నినో మిటిగేషన్ ప్లాన్, పంటల బీమా ద్వారా ఆర్థిక రక్షణఅనే పంచసూత్రాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 8,489 రైతు సేవా కేంద్రాల పరిధిలో 1,357 RSKలను High Riskగా, 2,077 RSKలను Moderate Riskగా గుర్తించి, APGS, శాటిలైట్ సమాచారం, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా రైతు కమతాలను Normal, Watch, Alert కేటగిరీలుగా విభజించి కమతం వారీగా ప్రత్యేక సలహాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాధార ప్రాంతాల్లో PMDS, Seed Pelletingను ప్రోత్సహిస్తూ సుమారు 23 లక్షల మంది రైతులు 25 లక్షల ఎకరాల్లో ఈ విధానాలను అనుసరిస్తున్నారని, PMDSను Green Fodder Managementతో అనుసంధానించి పశుగ్రాస కొరతను నివారిస్తున్నామని తెలిపారు.
