విజయవాడలో జాతీయ స్థాయి ‘సరస్ మేళా’

అక్టోబ‌ర్ 15 నుంచి 31వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంది

విజయవాడ : గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ఢిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతం వెలుపల జాతీయ సరస్ మేళా విజయవాడలో నిర్వహించనున్నారు. గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని (శివనాథ్) నేతృత్వంలో అక్టోబర్ 15 నుంచి 31 వరకు విజయవాడలోని బబ్బూరి గ్రౌండ్స్, పున్నమి ఘాట్ సమీపంలో ఈ మేళా జరగనుంది. దేశ వ్యాప్తంగా 31 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం నుంచి సుమారు 1,142 మంది మహిళా కళాకారులు, స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా పారిశ్రామికవేత్తలు ఈ మేళాలో పాల్గొననున్నారు. 571కు పైగా స్టాళ్ల ద్వారా చేనేత, హస్తకళలు, సహజ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, సంప్రదాయ గ్రామీణ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నారు. వివిధ రాష్ట్రాల ప్రత్యేక వంటకాలతో భారీ ఇండియా ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేయనున్నారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ లో భాగంగా సరస్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ వేదికలు గ్రామీణ మహిళలకు కేవలం ఉత్పత్తుల విక్రయానికే కాకుండా, వినియోగదారుల అభిరుచులను తెలుసు కోవడానికి, నాణ్యతను మెరుగు పరచడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి దోహద పడతాయి. గ్రామీణ మహిళల ఆదాయాన్ని స్థిరంగా పెంచి, వారిని స్వయం సమృద్ధి కలిగిన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమానికి సరస్ మేళా కీలక వేదికగా నిలవనుంది. 2025 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 3 కోట్ల లఖ్‌పతి దీదీల మైలురాయిని సాధించిన నేపథ్యంలో, 2026 ఫిబ్రవరిలో లక్ష్యాన్ని 6 కోట్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది.

ఈసారి సరస్ మేళాలో మహిళా వ్యాపారవేత్తలకు ఉపయోగపడే పలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. లఖ్‌పతి దీదీ పెవిలియన్: విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలను పంచుకుని, ఇతర మహిళలకు మార్గదర్శనం చేయనున్నారు. ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఈ-కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, వ్యాపార ప్రణాళికలపై నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక సహకారం, మార్కెట్ అవకాశాలపై సమాచారం అందించనున్నారు. మహిళా కళాకారులు తమ ఉత్పత్తులను తయారు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన 50కి పైగా స్టాళ్ల ద్వారా 571కి మందికి పైగా మహిళా ఫుడ్‌ సర్వీస్‌ వ్యాపారవేత్తలు ప్రాంతీయ వంటకాలను అందించనున్నారు. వివిధ రాష్ట్రాల కళలు, హస్తకళలు, వస్త్ర సంప్రదాయాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలతో జాతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటనున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికలు, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM) ద్వారా గ్రామీణ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు కూడా ఈ మేళా ప్రాధాన్యం ఇవ్వనుంది. 1999లో ఢిల్లీలో సుమారు 65 మంది లబ్ధిదారులతో ప్రారంభమైన జాతీయ సరస్ మేళా, దాదాపు మూడు దశాబ్దాల్లో గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు కీలక మార్కెట్ వేదికగా ఎదిగింది. ఇప్పటి వరకు 117 జాతీయ సరస్ మేళాలను నిర్వహించిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఈసారి తొలిసారిగా ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతం వెలుపల విజయవాడను వేదికగా ఎంచుకుంది.

Leave A Reply

Your Email Id will not be published!