హైదరాబాద్ : ముళ్లులేని బ్రహ్మజెముడుతో లాభాలు వస్తాయంటే నమ్మగలమా. అవునని అంటున్నారు చైతన్య కుమార్. తను బీడు నేల. నీరు తక్కువ. అటువంటి తన పొలంలో పెరిగే పంటల గురించి వెతికారు. ఆ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ ది డ్రై ఏరియాస్’ (ఐసీఏఆర్‌డీఏ) శాస్త్రవేత్తలను సంప్రదించి ముళ్లు లేని కాక్టస్ సాగుపై అవగాహన పెంచుకున్నారు. 2024 నవంబర్‌లో రూ. 10 చొప్పున 10,000 ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను (దీని ఆకునే పొలంలో నాటితే.. అదే వేరుపోసుకొని మొక్కగా ఎదుగుతుంది) కొనుగోలు చేసి 2.5 ఎకరాల్లో నాటారు. ఆ తర్వాత చైతన్య కుమార్ బ్రెజిల్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చిన 25 రకాల ముళ్లు లేని బ్రహ్మజెముడు జాతులను పెంచుతున్నారు. దీంతో ఆయన పొలం నర్సరీగా మారిపోయింది. సౌరశక్తితో నడిచే బోరు ద్వారా వేసవిలో 5-6 రోజులకు ఒకసారి, శీతాకాలంలో 15 రోజులకు ఒకసారి నీరు అందిస్తూ, ఏడాదికి రెండుసార్లు పశువుల ఎరువు వేస్తున్నారు. ఒక ఆకును పాలీబ్యాగ్‌లో నాటి 4 నెలల్లో 6 నుంచి 8 కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. గతేడాది రూ. 3 లక్షల పెట్టుబడితో 30,000 మొక్కలను విక్రయించి పెట్టుబడిని తిరిగి పొందారు. ఇప్పుడు తన పొలంలోని తల్లి మొక్కల ద్వారా ఏటా 4 లక్షల మొక్కలను ఉత్పత్తి చేసి, రూ. 40 లక్షల వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నారు. నర్సరీ పనుల కోసం సమీప గ్రామాలకు చెందిన 60 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.
ముళ్లులేని బ్రహ్మజెముడును ఐదు రకాలుగా ఉపయోగించు కోవచ్చు అని అంటున్నారు రైతు చైతన్య కుమార్. దీని ఆకులను కూర వండుకోవచ్చు అని పేర్కొన్నారు. పశుగ్రాసంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు ఈ ఆకులను ముక్కలు చేసి వేయొచ్చు. బయోగ్యాస్ తయారీకి వాడొచ్చు. సేంద్రియ బయో లెదర్ తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవిలో పచ్చగడ్డి దొరకనప్పుడు తన మేకలకు ఈ ఆకులను పౌష్టికాహారంగా అందిస్తున్నట్లు చైతన్య కుమార్ తెలిపారు. ‘వికసిత్ భారత్’ పథకం కింద జార్ఖండ్ ప్రభుత్వం 400 హెక్టార్లలో ముళ్లులేని బ్రహ్మజెముడు సాగును ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ప్రాజెక్టులకు చైతన్య కుమార్ మొక్కలు సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో రైతుల సహకార సంఘం ఏర్పాటు చేసి బయోగ్యాస్, బయో-లెదర్ ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పాలని తను లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు మేలు చేకూర్చేందుకు చేస్తున్న ఆయన ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుందాం.