తిరుమల : తిరుమలో శ్రీవారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాన్వాయ్ నుంచి దిగిన ఆయన కొద్దిసేపు కాలినడకన తిరుగుతూ భక్తులతో ముచ్చటించారు. తిరుమలకు వచ్చిన భక్తుల అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా ఉందని ముఖ్యమంత్రి భక్తులను అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యత చాలా బాగుందని భక్తులు ముఖ్యమంత్రికి తెలిపారు. శ్రీవారి లడ్డూకు ప్రత్యేకత ఉందని, దానిని మరింత నాణ్యవంతంగా, రుచికరంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తాజాగా తిరుమల కేంద్రంగా లడ్డూ నాణ్యతను పరిశీలించేందుకు భారీ ఖర్చుతో టెస్టింగ్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే శ్రీవారి దర్శనం వేగంగా జరిగేలా చూడాలని భక్తులు ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, త్వరలో ఏఐ టెక్నాలజీ ద్వారా శ్రీవారి దర్శనం త్వరితగతిన జరిగేలా టిటిడి చర్యలు తీసుకుంటోందని తెలిపారు . భక్తుల సౌకర్యార్థం టిటిడి ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతకు ముందు శ్రీ వెంగమాంబ అన్నప్రసాదాల వితరణ కేంద్రంలో శ్రీవారి సేవకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. భక్తులతో మరింత మమేకం కావాలని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అభిప్రాయ సేకరణ ప్రణాళిక బద్ధంగా చేపట్టాలని సూచించారు. నిత్యం ఎంతో శ్రమకు ఓర్చి తిరుమలకు వస్తుంటారని ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని టీటీడీ చైర్మన్, ఈవోలను ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.
