YSRCP: సామాన్యులకు వైసీపీ సర్కారు పన్నుల వాతలు
Jagan government Heavy taxes on the common man
YSRCP : అసలే లోటులో ఉన్న ఖజానాకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయని తేల కుండానే సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న పంపకాలకు అడ్డు ఆపూ లేకుండా పోయింది. ఈ క్రమంలో పన్నుల వడ్డింపుతో ఖజానాని నింపే పనిలో పడింది ప్రభుత్వం. ఇప్పటికే పలు అంశాలపై దృష్టి సారించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం తాఆగా మున్సిపాలిటీ ప్రజలపై ఆస్తి విలువ ఆధారంగా ఇంటి, నీటి, ఆస్తి పన్ను పెంచుతూ 196, 197 జీవోలు తీసుకువచ్చింది.
దీంతో ఇప్పటి వరకు ఉన్న పన్నులు ఇంటి అద్దె విలువ ఆధారంగా పన్ను విధిస్తారు. ఇంటి విస్తీర్ణం ఆధారంగా ఆ ప్రాంతంలో సుమారుగా ఎంత అద్దె ఉండే అవకాశం ఉందో రేట్లు నిర్ణయించి సంవత్సరానికి వచ్చే విలువ నిర్ధారించి, అందులో 15 నుండి 25 శాతం వరకు పన్ను గా, రెండు అర్ధ సంవత్సరాల్లో వసూలు చేస్తారు.
కానీ ఇప్పుడు ఆస్తి విలువ (స్థలం విలువ, కట్టడం విలువ) లెక్కగట్టి దాని ఆధారంగా పన్ను విధిస్తారు. ఒక పట్టణంలో 100 గజాల స్థలంలో ఇల్లు ఉంటే, రిజిస్ట్రేషన్ విలువ గజానికి రూ. 25 వేలు ఉన్నట్లయితే ఆ ఆస్తి విలువ రూ. 25 లక్షలు అవుతుంది. అందులో ఒక శాతం పన్నుగా నిర్ణయించినా, సంవత్సరానికి రూ. 25 వేలు ఇంటి పన్ను పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఎలానూ ప్రతి సంవత్సరం భూముల విలువలను ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది. కనుక ప్రతి సంవత్సరం భూమి విలువ ఆధారంగా ఇంటి పన్ను పెరుగుతుందని పన్ను కంటే పది రెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1704 కోట్లు ఆస్తిపన్ను గా వసూలవుతుండగా దీనిని ఒకేసారి రూ. 10 వేల కోట్లకు కూడా చేరే ప్రమాదం కూడా లేకపోలేదు.
మున్సిపాలిటీలలో మంచి నీరు, డ్రైనేజీ, పారిశుధ్య తదితర సేవలు అందించడానికి అయిన ఖర్చు మొత్తం లెక్కించి దాని మొత్తాన్ని ప్రజల నుండి వసూలు చేయాలని కేంద్రం ఆదేశించడంతోనే తాము ఈ పనిచేయాల్సి వస్తోందని, ప్రజలపై భారం మోపడం తమకు లేశ మాత్రం ఇష్టంలేదని ఈ మధ్య మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. పైగా ప్రజలపై భారం కేవలం 180 కోట్లు మాత్రమేనని తేల్చి చెప్పారు.
ఇప్పటికే ప్రతి పనికి, సేవకు రేటు కట్టి చార్జీలు వసూలు చేయాలని 24 /7 మంచినీటి సరఫరా చేసేందుకంటూ ఇళ్లలోని కుళాయిలకు మీటర్లు బిగించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి . మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ నిర్వహణకు అంటే సిబ్బంది జీతాలు, విద్యుత్ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు మొత్తం లెక్కించి దాని మొత్తాన్ని ప్రజల నుండి రాబట్టడానికి ప్రతి సంవత్సరం చార్జీలు పెంచుతారన్నమాట. . నీరు తాగినందుకే కాదు, భూగర్భ డ్రైనేజీ లోకి మురుగు నీరు వదిలినందుకు నెలవారి పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టంగా కనిపిస్తోంది.
సంక్షేమం మాటున పేదలకందించే పథకాలతో పోలిస్తే, మంత్రిగారు చెప్పిన 180 కోట్లు ఓమూలకు రాదు. వీటిని ప్రభుత్వమే సర్దుబాటు చేసుకుంటే పోయేది కదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పన్నుల భారం సాధారణ మధ్యతరగతి ప్రజల మీద పడటం ఖాయంగా కనిపిస్తోంది.
