దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యం : అమిత్ షా

కేంద్రం–రాష్ట్రాల మధ్య విశ్వాసం అత్యంత అవ‌స‌రం

మ‌హాబ‌లిపురం : కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యం అని పేర్కొన్నారు. గురువారం త‌మిళ‌నాడులోని మ‌హాబ‌లిపురంలో జ‌రిగిన హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జ‌రిగింది. ఈ కీల‌క మీటింగ్ కు ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, జోసెఫ్ చంద్ర‌శేఖ‌ర్, డీకే శివ‌కుమార్ , వీడీ స‌తీష‌న్ , పుదుచ్చేరి సీఎంతో పాటు కేంద్ర పాలిత ప్రాంత గ‌వ‌ర్న‌ర్లు హాజ‌ర‌య్యారు. సమావేశంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు. కేంద్రం–రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని సూచించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు ప్రతిపాదించారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ నడపాలని కోరారు. అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు సీఎం. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలని కోరారు సీఎం. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.

దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందన్నారు సీఎం. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదని అన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నట్టు స్పష్టం చేశారు సీఎం. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించాం అన్నారు. వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలన్నారు. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలన్నారు. కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు కేంద్ర అనుమతులు ఇవ్వాలన్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన చేయాల‌న్నారు. గోదావరి–కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ల‌భిస్తుంద‌న్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కలిసి నదీ జలాలపై సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు సీఎం. గంగా–కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరం అని పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!