డేటా సెంట‌ర్ల‌పై అపోహ‌లు వ‌ద్దు : నారా లోకేష్

అసెంబ్లీలో విద్య, ఐటి శాఖ‌ల‌ మంత్రి నారా లోకేష్

అమరావతి : ముఖ్యమంత్రి ఆదేశాల మేర‌కు 6.5 గిగావాట్లకు మించ‌కుండా ల‌క్ష్యాన్ని పూర్తి చేశామ‌ని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అసెంబ్లీలో డేటా సెంటర్లపై వస్తున్న అపోహలపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. కొంతమంది కావాలని డేటా సెంటర్లపై అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గూగుల్ అనే సంస్థ విశాఖ వస్తున్నామని ప్రకటించాకే ఐటి సంస్థలు విశాఖ వైపు చూస్తున్నాయని చెప్పారు. మ‌న‌మంతా వాడే స్మార్ట్ ఫోన్ అందులో వినియోగించే ఎఐ డేటా సెంట‌ర్ల‌తో ముడిప‌డి ఉంద‌న్నారు. 1995లో చంద్రబాబు ఐటి నేర్చుకోవాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు నారా లోకేష్. ఆ ప్రక్రియలో పనిచేసే ఎంప్లాయ్ చనిపోయారని, అప్పుడున్న ప్రతిపక్షం వాళ్లు కంప్యూటర్ రేడియేషన్ వల్ల ఆ ఎంప్లాయ్ చనిపోయారని ఆరోపణలు చేశారన్నారు. అప్పుడు వెన‌క్కి త‌గ్గి ఉంటే, హైదరాబాద్ ఈరోజు ప్రస్తుత స్థాయికి వచ్చేది కాదు. డేటా సెంటర్లపై వస్తున్న అపోహలు కూడా అలాంటివేన‌ని కొట్టి పారేశారు.

డేటా సెంటర్లకు సంబంధించి మేడమ్ మాధవి మూడు సమస్యలు చెప్పారన్నారు. మొదటిది నీటి భద్రత అని పేర్కొన్నారు. గోదావరి నుంచి ఐదేళ్ల సరాసరి తీసుకుంటే సాధారణంగా ప్రతిఏటా 3వేల టిఎంసిల నీరు బంగాళాఖాతంలో వృధాగా పోతోంద‌న్నారు నారా లోకేష్‌. మనం ఆ నీటిలో కొంతభాగాన్ని పోలవరంలోకి మళ్లించి గ్రావిటీ ద్వారా విశాఖకు తీసుకువస్తున్నాం అని చెప్పారు. ప్రస్తుత సాంకేతికత ప్రకారం 6.5 గిగావాట్ల డేటా సెంటర్లు విశాఖలో ఇన్ స్టాల్ అయితే 3 టిఎంసిల నీరు అవసరమవుతుందని వెల్ల‌డించారు. నేను పోలో ఆల్డో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్ ను స్వయంగా చూశానన్నారు. అక్కడ వాటర్ కూల్ టెక్నాలజీ లేదు, అంతా ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారని తెలిపారు. ఇంకా కొత్త‌ టెక్నాలజీలు వస్తున్నాయని ప్ర‌క‌టించారు. నీటి వినియోగం మరింత తగ్గించుకుంటూ వస్తున్నారని, ఎనర్జీ అవసరాలు కూడా తగ్గించే టెక్నాలజీ రాబోతోందన్నారు. పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నం నగర ప్రజల తాగు, సాగు, పరిశ్రమల అవసరాల‌కు కేటాయింపులు జ‌రిగాయన్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించిన నీటి వాటా నుంచే డేటా సెంటర్లకు అవసరమైన నీరందిస్తాం అని వెల్ల‌డించారు. రాబోయే 18నెలల్లో పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా విశాఖ ప్రజలకు తాగునీరు అందిస్తాం. డేటా సెంటర్లకు డెడికేటెడ్ పైప్ లైన్ ద్వారా నీరు అందిస్తాం తప్ప సిటీ ఇన్ ఫ్రా నుంచి మళ్లించేది లేదని ప్ర‌క‌టించారు నారా లోకేష్‌.

Leave A Reply

Your Email Id will not be published!