అమరావతి : ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో ఎలాంటి జాప్యమూ జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీజీస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయలి. టిడ్కో ఇళ్లు కాకుండానే మరో 5 లక్షలకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలో ఎక్కడా ఆలస్యం కాకూడదు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం అన్నారు. లబ్దిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇది ఇలాగే కొనసాగాలని అన్నారు. ఇళ్ల నిర్మాణంతోపాటు ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని స్పష్టం చేశారు సీఎం. సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్టు సర్వేలో తేలిందన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాన్ని ఎంత వేగంగా చేపడుతున్నారో.. ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అదే స్థాయిలో చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేయాలని అన్నారు. ఇక వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
