అమరావతి : స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేతృత్వంలో బీసీ నాయకుల సంబరాలు జరుపుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి బీసీ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ బీసీల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. బీసీలకు వెన్ను దన్నుగా దివంగత సీఎం అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే లభించాయని చెప్పారు ఎస్. సవిత. తొలుత అన్న ఎన్టీఆర్ బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారిని రాజ్యాధికారంలో భాగస్వామ్యులు చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను అన్నిరంగాల్లో ముందంజలో ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. అన్న ఎన్టీఆర్ బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే 1995లో సీఎం చంద్రబాబు నాయుడు ఆ సంఖ్యను 34 శాతానికి పెంచారన్నారు.
2021 వరకూ ఆ రిజర్వేషన్లు కొనసాగుతూ వచ్చాయన్నారు. జగన్ వచ్చిన తరవాత స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు కోత విధించి, 24 శాతం అమలు చేశారన్నారు సవిత. దీనివల్ల బీసీలు 16,800 పదవులకు దూరమయ్యారన్నారు. బీసీలకు పదవులే కాకుండా ఆర్థికంగా లబ్ధి కలిగించే పథకాలను సైతం జగన్ రద్దు చేశారన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో బీసీలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారన్నారు. ఇదేంటని ప్రశ్నించిన బీసీలను, ఆ సామాజిక వర్గ నేతలను తప్పుడు కేసులతో వేధించారన్నారు ఎస్. సవిత. మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీసీలకు మంచిరోజులు ప్రారంభం అయ్యాయన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలు కోల్పోయిన పదవులు మరోసారి లభించనున్నాయన్నారు. నిర్ణయాధికారంతోనే బీసీలకు అందలం దక్కుతుందని మంత్రి సవిత తెలిపారు.
