హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన సీఎంను ఏకి పారేశారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైలు పట్టాలు ఎక్కాలంటే తన వల్ల సాధ్యం కాదన్నారు. 2028లో కేసీఆర్ సీఎం అయ్యాకే అది సాధ్యం అవుతుందన్నారు. అంత వరకు సొల్లు కబుర్లు చెప్పాల్సిందేనని ఎద్దేవా చేశారు. తనను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఆయా రాం గాయా రాం అన్నట్టుగా తన పరిస్తితి తయారైందన్నారు. తను ఎందుకోసం ఢిల్లీకి వెళుతున్నాడో ఎవరికీ తెలియడం లేదన్నారు. పాలన గాడి తప్పిందని ఆరోపించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయి పోయాయని వాపోయారు. ఇక తను ఏ స్కీం గురించి మాట్లాడినా లేదా తీసుకు వచ్చినా దాని వెనుక అతి పెద్ద స్కాం తప్పక ఉంటుందని చెప్పారు కేటీఆర్. అందుకే పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ మోసం గురించి, సీఎం నిర్వాకం గురించి ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేస్తున్నవ్ నాయనా అంటే చెప్పడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నడు. మెట్రో దగ్గర 280 ఎకరాల విలువైన భూములున్నాయి. సుమారు రూ.30 వేల కోట్ల విలువ చేసే భూములు. ఆయన అన్నదమ్ములకో, బావమరిదులతో, అల్లుడికో కట్టబెట్టేందుకే ఆ 280 ఎకరాల విలువైన భూములపై కన్నేసిండు కాబట్టే ఇవాళ ఆ మెట్రోను స్వాధీనం చేసుకుని.. 14 వేల కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. రాబోయే రోజుల్లో ఎవరికి అమ్ముతాడు.. ఎవరు కొంటారు. ఎట్లా అమ్ముతాడో చూస్తారన్నారు .
