అమరావతి : ఏపీని వడగాల్పులు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు మరోవైపు ఉరుములతో కూడిన పిడుగుపాటు వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. నంద్యాల జిల్లా సంజామలలో 43.3 డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 126 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రంలో 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు.
అల్లూరి జిల్లా జికే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గంగవరం, కూనవరం, రంప చోడవరం తో పాటు కోనసీమ జిల్లా ఆత్రేయపురం , తూర్పుగోదావరి జిల్లా చాగల్లు, గోకవరం, కోరుకొండ,కొవ్వూరు, రాజ మహేంద్రవరం అర్బన్ , రూరల్, రాజానగరం, సీతానగరం, తాళ్లపూడి , ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీం పట్నం, కంచికచర్ల , అనంతపురం జిల్లా అనంతపురం రూరల్, బుక్కరాయ సముద్రం మండలాల్లో(20) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం 26 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు నైరుతి , ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం నుండి, తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.
