ఆక్వా రైతుల పేరుతో జగన్ రాజకీయ డ్రామాలు

నిప్పులు చెరిగిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్న

అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ఆక్వా రైతుల సమస్యలపై నిజాలను పక్కనపెట్టి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీయడం, గోబెల్స్ లా తప్పుడు ప్రచారం చేయడం ఎమ్మెల్యే జగన్‌కు అలవాటుగా మారిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు మాట్లాడాలని, కానీ రాజకీయ లాభాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తూ రైతులను మానసిక ఆందోళనకు గురిచేయడం అత్యంత బాధ్యతా రాహిత్యమని అన్నారు. ఆక్వా రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని, ఫీడ్ కంపెనీలతో కుమ్మక్కై రైతులను నష్ట పరుస్తోందని జగన్ చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు.

రైతుల సమస్యలు వస్తే పరిష్కారం చూపడం నాయకుడి బాధ్యత అన్నారు. కానీ ప్రజల్లో భయం పుట్టించి, రాష్ట్రంపై ప్రపంచ వ్యాప్తంగా తప్పుడు సంకేతాలు పంపించడం జగన్ రాజకీయ విధానంగా మారిపోయిందని ఆరోపించారు అచ్చెన్నాయుడు. రైతుల పేరుతో రాజకీయ నాటకాలు ఆడటం మానేసి, ముందు తన పాలనలో ఆక్వా రంగాన్ని ఎలా నష్టపరిచారో ప్రజలకు సమాధానం చెప్పాలి అని మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా జగన్ ఇప్పటికీ అదే అవినీతి మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారని ఆరోపించారు. గ‌తంలో వైసీపీ పాలనలో ఫీడ్ తయారీ సంస్థల దగ్గర మీ ప్ర‌భుత్వం ఎంత కమీష‌న్లు తీసుకున్నారో అలానే ఈ ప్ర‌భుత్వం కూడా తీసుకుని ఉంటుంద‌న్న‌ భ్ర‌మ‌లో జ‌గ‌న్ ఉన్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!