శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్నాం
కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి మంత్రి వివరణ
అమరావతి : ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావు ను మర్యాద పూర్వకంగా కలిశారు మంత్రి. ఈ సందర్బంగా ఆయనకు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలను, వాటి పురోగతి గురించి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటే సమాంతరంగా నిర్వాసితుల కోసం సహాయ ,పునరావాస పనులు వేగవంతం చేశాం అన్నారు నిమ్మల రామానాయుడు.
ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పెండింగ్ డిజైన్లకు వెంటనే అనుమతులు వచ్చేలా సహకరించాలని కేంద్ర జలశక్తి కార్యదర్శిని కోరారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువలు 17,500 క్యూసెక్కులకు పెంచిన సామర్ధ్యాల రియంబర్స్మెంట్ కు సహకరించాలని అన్నారు. వృధాగా సముద్రంలో కలిసి పోతున్న గోదావరి వరద జలాలు వినియోగించుకునేలా, పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు తక్షణమే సాంకేతిక-ఆర్దిక అనుమతులు ఇవ్వాలని కోరారు నిమ్మల రామానాయుడు. ఏటా సగటున 3వేల టిఎంసి నీరు బంగాళా ఖాతంలో కలసి పోతుందని వివరించారు. తుఫానులు, ఆటుపోట్లు వంటి సముద్రపు కోత, నదుల కోతకు గురవుతున్న ప్రాంతాలకు రక్షణకు సాయం చేయాలని సూచించారు.
గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదుల ఏటి గట్ల పటిష్టతకు సహకరించాలని కోరారు కేంద్ర జలశక్తి కార్యదర్శిని మంత్రి. డెల్టా డ్రైన్స్ తో పాటు, సముద్రంలో కలిసే చోట, ముఖద్వారాల వద్ద పూడిక తీయడం, వెడల్పు చేయడానికి నిధులు సాయం అందించాలన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ వంటి వాటికి కర్ణాటక ముందుకు వెళ్లకుండా సహకరించాలని కోరారు.
