మంగళగిరి: ఇది టీడీపీ 3.O వర్షన్ అని , పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకు వెళ్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ లకు శిక్షణా తరగతుల్లో భాగంగా ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిది అని అన్నారు. ఎంతోమంది గొప్ప నాయకులను తెలుగుదేశం పార్టీ తయారు చేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ తెలుగుదేశం యూనివర్సిటీయేనని, రెండో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం యూనివర్సిటీనే అని చెప్పారు నారా లోకేష్.
తెలుగుదేశం పార్టీ నాయకులను తయారుచేసే కార్ఖానా అని స్పష్టం చేశారు. గతంలో గండిపేటలో నిరంతరం పార్టీ శిక్షణ తరగతులు జరిగేవి. చాలా మంది ఉప ముఖ్యమంత్రులు అయినవారు ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. ఇప్పుడు ఏడాదిలో కనీసం 300 రోజులు పార్టీ శిక్షణ తరగతులు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం మీకు పదవులు ఇస్తున్నాం, కానీ ఏం చేయాలో చెప్పడం లేదు. చాలా మందికి వారి బాధ్యతలు ఏంటో తెలియవు. వేటి ఆధారంగా పార్టీ తమను గుర్తిస్తుందో చాలా మందికి తెలియదని, అంందుకే ఈ శిక్షణ తరగతులను దశల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా వారికి అవగాహన వస్తుందన్నారు.
