సేంద్రియ వ్యవసాయం భ‌విష్య‌త్తుకు సోపానం

కిసాన్ మేళాలో మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

పశ్చిమగోదావరి జిల్లా : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం కూట‌మి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు స్ప‌ష్టం చేశారు. ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలోని పెనుమంట్ర మండలం మారుటేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు – సుస్థిర వరి వ్యవసాయం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత‌ ప‌రిశోధ‌న కేంద్రంలోని ల్యాబ్ ల‌ను ప‌రిశీలించి శాస్త్ర‌వేత్త‌ల‌తో మాట్లాడారు. ఆధునిక వ‌రి వంగ‌డాల వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన ఎన్ జీ రంగా వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం, ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేస‌ని ప్ర‌త్యేక స్టాల్స్ ని ప‌రిశీలించి, వ్య‌వ‌సాయ రంగంలో ఉపయోగించే ఆధునిక యంత్రాల‌ను స్వ‌యంగా డ్రైవ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా రైతుల‌ను ఉద్దేశించి స‌భ‌లో మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులకు తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాలు సాధ్యమవుతాయని అన్నారు. అదే సమయంలో భూమి సారాన్ని కాపాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగం వల్ల భూమి నాణ్యత దెబ్బ తింటోందని, రైతుల ఖర్చులు పెరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అత్యవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు మారేందుకు శిక్షణ, సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలు అందిస్తున్నదని ఆయన వివరించారు.

Leave A Reply

Your Email Id will not be published!