వాల్మీకిపురం ఆలయ అభివృద్ధికి రూ.5.73 కోట్లు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్

అన్న‌మ‌య్య జిల్లా : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభి రామస్వామివారి ఆలయాన్ని మరింత ఆధ్యాత్మిక వైభవంతో అభివృద్ధి చేసేందుకు రూ.5.73 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సనాతన ధర్మాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణానికి టీటీడీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 5 వేల ఆలయాల నిర్మాణ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 1,200 ఆలయాల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామ స్వామివారి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వెల్ల‌డించారు. ఆల‌య అభివృద్ధిలో భాగంగా పుష్క‌రిణి కోసం రూ. 1.12 కోట్లు, క‌ళ్యాణ వేదిక మండ‌ప నిర్మాణం కోసం రూ. 73 ల‌క్ష‌లు, దక్షిణ వైపు రాజగోపురం పునర్నిర్మాణం కోసం రూ.52 లక్షలు, ఆలయ ప్రవేశ ఆర్చ్ కోసం రూ.30 లక్షలు, కళ్యాణ మండపం రెండో అంతస్తు నిర్మాణం కోసం రూ.1.80 కోట్లు, పార్వేట మండపం పునర్నిర్మాణం కోసం రూ.1.26 కోట్లు కేటాయించిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ చెప్పారు.

కాగా, ఆలయానికి చేరుకున్న టీటీడీ చైర్మన్‌కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని వేదాశీర్వచనం పొందారు. ఆలయ విమాన ప్రాకారాన్ని ప్రదక్షిణ చేసిన అనంతరం శ్రీరాముల వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, బోర్డు సభ్యులు జి. భానుప్రకాశ్ రెడ్డి, శాంతారాం, పనబాక లక్ష్మి, నరేష్ కుమార్, ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్ దివాకర్ రెడ్డి, సీఈ మనోహరం, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో పి. వరలక్ష్మి, ఈఈ మల్లికార్జున ప్రసాద్, ఏఈవో గోపినాథ్, అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!