బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : బీసీ హాస్టళ్లపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మరో రెండు నెలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని, ఈలోగా హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో రెండు నెలల తరవాత నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు చేరే నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. హాస్టళ్లలోకి దోమలు రాకుండా దోమల నెట్ లు కిటికీలు, ద్వారాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. పరిశుద్ధమైన తాగునీరు అందించడంలో భాగంగా గడువులోగా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు ఎస్. స‌విత‌.

బీసీ హాస్టళ్లలో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. సీఎం ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పాటు చేయబోయే 10 ఎంజేపీ స్కూళ్లను వచ్చే విద్యా సంవత్సరానికి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు మంత్రి ఎస్. స‌విత‌. రాబోయే విద్యా సంవత్సరంలో బీసీ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ఏ ఒక్క బీసీ బిడ్డ బడి బయట ఉండకూడదని హెచ్చ‌రించారు. ఆదరణ 3.0 పథకం అమలుపై తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవీలత, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు, బీసీ కార్పొరేషన్ జీఎం భీమశంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!