ఘనంగా శ్రీ కోదండ రామస్వామి ఆస్థానం

తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు

తిరుప‌తి : అన్నమయ్య జయంతి ఉత్సవాలు వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ కోదండ రామస్వామి వారి ఆస్థానం ఘ‌నంగా నిర్వహించారు. శ్రీరామనామ స్మరణతో, గోవింద నామ సంకీర్తనల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. ముందుగా శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం నుండి ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ అన్నమాచార్య కళా మందిరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు భక్తి రసభరిత సంకీర్తనలను ఆలపించి శ్రీరామ భక్తిని పరవశింప జేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు.

ఉదయం నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లో అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు “రామచంద్రుడితడు రఘువీరుడు”, “జయతు జయతు మంత్రం జన్మసాఫల్య మంత్రం”, “జయ జయ రామ”, “రాముడు రాఘవుడు” తదితర సంకీర్తనలను మధురంగా ఆలపించి భక్తులను అలరించారు. తదనంతరం తిరుపతికి చెందిన హేమప్రకాశ్ బృందం గాత్ర సంగీత సేవ అందించగా, వేంకటేశ్వర్లు భాగవతార్ హరికథా గానం ద్వారా శ్రీరాముని మహిమను భక్తులకు వినిపించారు.సాయంత్రం బెంగళూరుకు చెందిన స్వాతి రామలక్ష్మీ బృందం సంగీత సభ నిర్వహించనుండగా, అనంతరం కుమారి నయనప్రియ బృందం “శ్రీరామ జననం” నృత్య రూపకాన్ని ప్రద‌ర్శించారు. మహతి కళాక్షేత్రంలో సాయంత్రం తిరుపతికి చెందిన రమణి, రాజేష్‌కుమార్ బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించారు. రాత్రి హైదరాబాద్‌కు చెందిన స్వాతిరెడ్డి బృందం భక్తిరసభరిత నృత్య ప్రదర్శన ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డా. మేడసాని మోహన్‌, డైరెక్టర్ లత‌, శ్రీ కోదండ రామస్వామి ఆలయ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్‌తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!