విజయవాడ: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) 2026-27 సీజన్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిశారు. తన నామినేషన్ పత్రాలను అధికారికంగా అందజేశారు. గత సీజన్ (2025-26)లో సుజయ్ కృష్ణ రంగారావు నేతృత్వంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ అద్భుతంగా క్రీడాభిమానుల్ని ఆకట్టుకుంది. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించింది. క్రీడాకారుల ఎంపిక నుంచి టోర్నమెంట్ నిర్వహణ వరకు ఆయన చూపిన చొరవతో ఏపీఎల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ అనుభవాన్ని, విజయ పరంపరను కొనసాగించాలనే సంకల్పంతో ఈ ఏడాది కూడా ఆయన చైర్మన్ పదవికి పోటీ చేస్తున్నారు.
ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. రాష్ట్రంలోని క్రికెట్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, గ్రామీణ స్థాయి ప్రతిభను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సుజయ్ కృష్ణ రంగారావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ సర్కార్ సైతం తనను ప్రోత్సహిస్తుండడంతో ఇక ఈ ఎన్నిక కేవలం లాంఛనప్రాయం కానుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఇప్పటికే బీసీసీఐతో సత్ సంబంధాలు కొనసాగిస్తున్నారు. క్రికెట్ పై ఫోకస్ ఉండాలని సూచించారు మంత్రి నారా లోకేష్.
