విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ చేసిన మాయోపాయం పారలేదంటూ ఎద్దేవా చేశారు. అక్రమ చట్టాలకు అవనిని అడ్డుపెట్టి ఆమోదించాలనే కుతంత్రం నిలబడలేదని పేర్కొన్నారు. సాధికారిత పేరుతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీయాలనే బీజేపీ కుయుక్తులు చెల్లలేదన్నారు. ఒక రకంగా చెంపపెట్టు అని, అయినా బుద్ది రావడం లేదన్నారు షర్మిలా రెడ్డి. ఎన్డీఏ అధర్మంపై ఇండియా కూటమి చేసిన ధర్మ యుద్దం గెలిచిందన్నారు. ప్రజాస్వామ్యం బతికే ఉందని బిల్లు వీగి పోవడంతో తేలి పోయిందన్నారు. ఇకనైనా మోదీ, షా పరివారం ఆలోచిస్తే మంచిదన్నారు.
ఇది 143 కోట్ల భారతీయులు సాధించిన విజయమని పేర్కొన్నారు షర్మిలా రెడ్డి. బీజేపీ రాజకీయ దురుద్దేశ్యానికి ఇది నిజంగా చరమ గీతం పాడిందన్నారు. మహిళల పేరుతో నీచ రాజకీయాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి , మత పిచ్చి బీజేపీకి బిగ్ షాక్ తగిలిందన్నారు. వీగిపోయింది అతి గతి లేని డీ లిమిటేషన్ బిల్లే తప్పా మహిళా బిల్లు కాదన్నారు ఏపీపీసీసీ చీఫ్. విపక్షం ఎన్నడూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. నారీ పేరుతో తెచ్చింది డీ లిమిటేషన్ బిల్లు మాత్రమేనని, ఇవ్వాళ వీగిపోయింది నియోజక వర్గాల పునర్విభజన బిల్లేనని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తిప్పికొట్టింది కేవలం రాజ్యాంగాన్ని మార్చే కుట్రనేనని స్పష్టం చేశారు షర్మిలా రెడ్డి. మహిళా బిల్లుకు ఆమోదం దక్కింది 2023 లోనేనని అన్నారు.
