రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పార‌ద‌ర్శ‌క పాల‌న

పౌర సేవ‌ల నాణ్య‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌న్న సీఎం

విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా ఎప్పటికప్పుడు పాలనా వ్యవహారాలను, పౌరసేవల నాణ్యతను పర్యవేక్షిస్తున్నాం అని తెలిపారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో నిర్వహిస్తోన్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును మంగ‌ళ‌వారం సీఎం ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాలు మెరుగు పరచడమే లక్ష్యంగా మిషన్‌ కర్మయోగి రెండు రోజుల వర్క్ షాప్ కు శ్రీ‌కారం చుట్టింద‌న్నారు సీఎం. ప్రభుత్వ శిక్షణ సంస్థల కెపాసిటి బిల్డింగ్, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చ జ‌ర‌గ‌డాన్ని ఆహ్వానించారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్‌, మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్ వర్క్ భాగస్వామ్యంలో ముసాయిదా రూపకల్పన చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

రెండు రోజుల సదస్సులో వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజెంటేషన్లు ఇస్తార‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా కాకుండా, ఆయా శాఖల పనితీరును మెరుగు పరిచేలా సన్నద్ధం అయ్యేలా కార్యాచరణ రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు. డేటా లేక్ లాంటి వ్యవస్థలు, ఇ- ఫైళ్ల విధానం ద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం అని చెప్పారు. కీ పెర్ఫార్మెన్సు ఇండి కేటర్లను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో సూచనలు జారీ చేస్తున్నాం అని తెలిపారు. ఐ గాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా 2 కోట్ల కోర్సులను పూర్తి చేసి ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని అన్నారు సీఎం.

ఉద్యోగులు, ప్రభుత్వ యంత్రాంగం లేకుండా ఏ ప్రకృతి విపత్తును ఎదుర్కోలేం అన్నారు. పండుగలైనా, కార్యక్రమాలైనా ఉద్యోగులే కీలకం అని పేర్కొన్నారు. కుటుంబాలను సైతం పక్కన పెట్టి ఉద్యోగులు ప్రజా సేవలో నిమగ్నం అవుతున్నారు. వారిని ఎప్పుడూ విస్మరించలేం అన్నారు. అందుకే వారి సామర్ధ్యాలను పెంచేలా, నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా ఈ శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నాం అని చెప్పారు. నాయకత్వ లక్షణాలను పెంపోందించేలా ఐగాట్ -మిషన్ కర్మయోగి ప్రయత్నం చేస్తోందన్నారు. .రీల్స్ కంటే కెపాసిటి బిల్డింగ్ కోసం సమయం వెచ్చిస్తే మన వ్యక్తిగత నైపుణ్యాలను పెంచుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.

ప్రజలకు అందించే సేవల నాణ్యత పెరగాలంటే టెక్నాలజీని, విధానాలను అనుసంధానిస్తూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు సీఎం. ప్రభుత్వ శాఖల మధ్య నిరంతరాయంగా సమాచార పంపిణీ జరగాలన్నారు. అప్పుడే వేగంగా నిర్ణయాలు తీసుకోగలం అని చెప్పారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడే దేశం అగ్రస్థానానికి చేరుతుందన్నారు. సంక్షోభంగా మారకముందే మనం సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించేలా నైపుణ్యాలు పెరగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!