అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజుల నుంచి మెగా డీఎస్సీ 2025కి సంబంధించి వస్తున్న ఆరోపణలకు స్పందించింది విద్యా శాఖ. మెగా డీఎస్సీ ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాం అన్నారు కార్యదర్శి కోన శశిధరర్. అభ్యర్థులు కష్టపడి చదవి ఉద్యోగాలు పొందారు. 2018 తర్వాత మళ్లీ 2025లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. డీఎస్సీ నిర్వహణకు టెట్ నోటిఫికేషన్ ఇవ్వడమనేది మాండేటరి కాబట్టి… ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. టెట్-డీఎస్సీ మధ్య సమన్వయం ఉంది కాబట్టే ఇంత చక్కగా నిర్వహించగలిగాం. నార్మలైజేషన్ ప్రక్రియను ఏ విధంగా చేస్తామోననే అంశాన్ని కూడా ముందుగానే వివరించాం. చిన్న పొరపాటు లేకుండా అత్యుత్తమంగా డీఎస్సీ నిర్వహించాం. టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్సీ వర్గీకరణ, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేశాం. ప్రతీ అంశాన్ని ఆన్ లైన్లో పొందుపరిచాం. వెబ్ సైట్లో పెట్టాం. గడిచిన డీఎస్సీల నిర్వహణ అనుభవంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అని కోన శశిధర్ చెప్పారు.
154 టీసీఎస్ ఐయాన్ సెంటర్లల్లో ఈ డీఎస్సీ పరీక్షను నిర్వహించాం. ఒకే సబ్జెక్టుకు వివిధ తేదీల్లో పరీక్షలు నిర్వహించాం.. కాబట్టి వేర్వేరు పేపర్లే ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు సుమారు 3 వేల క్వశ్చన్లతో క్వశ్చన్ బ్యాంకు రూపొందించాం. పర్మినెంట్ ఉద్యోగులైన ఇద్దరికి మాత్రమే క్వశ్చన్ బ్యాంకుకు యాక్సెస్ ఉంటుంది. ప్రతి రోజూ పాస్ వర్డ్స్ మారుతూ ఉంటాయి. ఎస్‌ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, గేట్, ఎన్టీఏ, సీఏటీ, ఏపీపీఎస్సీ, హైకోర్ట్ పరీక్షలు వంటివి నిర్వహించిన టీసీఎస్ ఐయాన్‌కే ఈ బాధ్యతలు అప్పగించాం. ఇది మాన్యువల్ ఎగ్జామ్ కాదు.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-CBT పద్దతిలో మెగా డీఎస్సీ నిర్వహించాం. అన్ని జిల్లాల స్కోర్స్ వెబ్ సైట్లల్లో పబ్లిష్ చేశాం… టెట్, డీఎస్సీ సోర్స్ కూడా వెబ్ సైట్లల్లో పబ్లిష్ చేశాం..
ఇప్పటికీ ఉన్నాయి. స్కోర్స్ ఇవ్వలేదని చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో భాగంగా ముందుగా ఆన్ లైన్లో అప్లోడ్ చేయాలని నిబంధన పెట్టాం.. అయితే వెరిఫికెషన్ కు వచ్చినప్పుడు సర్టిఫికెట్లు తెస్తామని రిక్వెస్ట్ చేయడంతో ప్రభుత్వం అంగీకరించింది. గతానుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్టు కాకుండా.. 1:1 పద్దతిలో పిలిచాం.. దీన్ని ఆనాడే అందరికీ చెప్పాం. వెరిఫికేషన్లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత వారిని వెరిఫికేషన్‌కు పిలిచాం. హారిజంటల్ రిజర్వేషన్లలో స్పోర్ట్స్, మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలు ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టే కోర్టులు డీఎస్సీ-2025 నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రస్తుతం పేపర్లల్లో వస్తోన్న కథనాలన్నీ హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించినవే. ప్రతి ఫిర్యాదును పరిశీలించాం….సమాధానాలిచ్చాం. ఎవరికైనా అనుమాలు ఉంటే.. వారికున్న అనుమానాలను నివృత్తి చేశాం. సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని విద్యా శాఖ కార్యదర్శి అన్నారు.
