అమరావతి : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా కొండవీడు దగ్గర ఉన్న జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. జిందాల్ పరిశ్రమ తరహా చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను గోదావరి నది కాలుష్యాన్ని పారదోలేందుకు ఎలా అనుసంధానం చేయవచ్చు..? అక్కడ చెత్తను వేరు చేసి విద్యుత్తు తయారీకి ఎలా ఉపయోగించు కోవచ్చు అన్న అంశాలను పరిశీలించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల. ప్రతి రోజూ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను సద్వినియోగం చేసుకునేలా మరిన్ని చెత్త నుంచి విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల.
చెత్తను తీసుకురావడం దగ్గర నుంచి ఆఖరికి బాయిలర్ నుంచి బూడిదగా మారి, దాన్ని సైతం ఉపయోగించే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సింగపూర్ లో విద్యుత్తు ఉత్పత్తిలో 2.8 శాతం విద్యుత్తు చెత్త నుంచే ఉత్పత్తి అవుతుందని తెలిపారు ప్లాంటు అధికారులు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు గ్రిడ్లు చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్లాంట్లు అనుసంధానం చాలా బాగుందని అన్నారు. సరఫరాలో వృథా శాతం అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ కు వివరించారు. రాష్ట్రంలో మరిన్ని చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్లాంట్ల నెలకొల్పేలా, ఇండోర్ మోడల్ లో చెత్తను పద్ధతిగా, పారదర్శకంగా వేరు చేసేలా పని చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు.
