బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌విత

అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

విజయవాడ : ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరం గొల్లపూడి బీసీ భవన్ లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్ ను మంత్రి సవిత సందర్శించారు. ఈ సందర్బంగా బీసీ అభ్యర్థులకు వివిధ సబ్జెక్టులకు చెందిన 43 రకాల మెటీరియల్ ను వారికి అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో ఉండే కీలక స్థానాల్లో బీసీ యువత ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడుసంకల్పమన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందజేయాలని సీఎం నిర్ణయించారని చెప్పారు మంత్రి ఎస్. స‌విత‌. 16,457 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగానే, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఆఫ్ లైన్ కోచింగ్ ప్రారంభించామన్నారు. ఇంటి వద్ద ఉండే మహిళలకు, పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకునే బీసీ అభ్యర్థుల కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ కూడా నిర్వహించామన్నారు స‌విత‌. రాష్ట్ర వ్యాప్తంగా 300ల మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారన్నారు. గతేడాది ఉచిత సివిల్స్ కోచింగ్ కూడా నిర్వహించామన్నారు. సివిల్స్ కోచింగ్ తీసుకున్నవారిలో పలువురు గ్రూప్ -1, రైల్వే, బ్యాంకులు వంటి రంగాల్లోనూ ఉద్యోగాలు సాధించారన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!