మ‌హిళా కానిస్టేబుళ్ల‌కు మాన‌సిక స్థైర్యం అవ‌స‌రం : అనిత

శిక్ష‌ణ పూర్తిచేసుకున్న 473 మంది పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

విజ‌య‌న‌గ‌రం జిల్లా : శారీర‌క ధారుడ్యాన్ని పెంచు కోవ‌డంతోపాటు మాన‌సిక స్థైర్యంతో ముంద‌డుగు వేయాల‌ని, విధి నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయవద్దని శిక్ష‌ణ పూర్తి చేసుకున్న మ‌హిళా కానిస్టేబుళ్ల‌కు రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగ‌ల‌పూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పోలీస్ శిక్ష‌ణా క‌ళాశాల‌లో శిక్ష‌ణ పూర్తిచేసుకున్న 473 మంది 2025-26 బ్యాచ్ మ‌హిళా కానిస్టేబుళ్ల‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్ క‌ళాశాల మైదానంలో సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగిది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మ‌హిళా కానిస్టేబుళ్ల‌లో స్ఫూర్తిని నింపారు. వారి వ‌ద్ద‌నుంచి గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. పెరేడ్‌ను తిల‌కించారు. శిక్ష‌ణ‌లో మెరుగైన ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రిచిన కేడెట్స్‌కు జ్ఞాపిక‌ల‌ను అంద‌జేశారు. పిటిసిలో కొత్త‌గా నిర్మించిన కంప్యూట‌ర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. శిక్ష‌ణ పూర్తిచేసుకున్న మ‌హిళా కానిస్టేబుళ్లు ఈ సంద‌ర్భంగా సామూహికంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. కేడెట్స్‌తో, వారి త‌ల్లితండ్రుల‌తో మంత్రి మ‌మేక‌మై మాట్లాడారు.

పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్స్ వెన్నుముక అని పేర్కొన్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల కానిస్టేబుల్‌గా ఉంటే, స్టేష‌న్‌కు భ‌యంతో వ‌చ్చే బాదిత మ‌హిళ‌లుకు మ‌రింత ధైర్యంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. మ‌హిళ‌లు, బాలిక‌ల రక్ష‌ణ వీరిపై ఉంటుంద‌న్నారు. 9 నెల‌ల క‌ఠిన శిక్ష‌ణ జీవితానికి పునాది లాంటిద‌ని అన్నారు. పోలీసు ఉద్యోగ‌మంటేనే ఎంతో బాధ్య‌త‌తో కూడిన‌ద‌ని, స‌మాజంలో ఎంతో ప్ర‌భావ‌వంత మైన‌ద‌ని తెలిపారు. పోలీసుల వ‌ల్లే రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయ‌ని, దానివ‌ల్లే రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌ర‌ద‌లా వ‌స్తున్నాయ‌ని అన్నారు. అందువ‌ల్ల పోలీసు శాఖ‌కు ముఖ్య‌మంత్రి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిస్తూ, నియామ‌కాలు చేప‌ట్ట‌డ‌మే కాకుండా, శిక్ష‌ణ‌లో కేడెట్స్‌కు ఇచ్చే స్టైఫండ్‌ను రూ.12 వేల‌కు పెంచార‌ని చెప్పారు. ఒక‌వైపు కుటుంబ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తూ, మ‌రోవైపు ఉద్యోగ బాధ్య‌త‌ల‌ను కూడా నిర్వ‌ర్తించ‌డం ఎంతో క‌ష్ట‌మ‌ని, అది మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి పంపించిన వారి త‌ల్లితండ్రుల‌ను, కుటుంబ స‌భ్యుల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి అభినందించారు. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని, వేసుకున్న యూనిఫాంకు మ‌రింత గౌర‌వం వ‌చ్చే విధంగా, ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను పెంచేవిధంగా ప‌ని చేయాల‌ని మంత్రి కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!