Wrestlers Protest Comment : రెజ్లర్లపై కక్ష కేంద్రం వివక్ష
ఖాకీల తీరుపై సర్వత్రా ఆగ్రహం
Wrestlers Protest Comment : ఓ వైపు నూతన పార్లమెంట్ భవనం ప్రారంభమైంది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా , రాజ్యాంగానికి పరిరక్షణగా భావించే భవనం సాక్షిగా దేశ రాజధానిలో అంతా చూస్తూ ఉండగానే ఢిల్లీ ఖాకీలు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తల వంచుకునేలా చేసింది. వాళ్లు దేశ ద్రోహులు కారు. ఆర్థిక నేరస్థులు అంతకన్నా కారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీలు అంతకన్నా కారు. కానీ సమున్నత భారతావని గర్వపడేలా తమను తాము తీర్చిదిద్దుకున్నారు మహిళా రెజ్లర్లు(Wrestlers). గత కొంత కాలంగా తాము అనేక అవమానాలు ఎదుర్కొంటున్నామని, అంతకు మించి తమ శరీరాలకు, ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మందికి పైగా భారత రెజ్లర్ల(Wrestlers) సమాఖ్య చీఫ్ , భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ పై సంచలన ఆరోపణలు చేశారు.
తాము లైంగికంగా, శారీరకంగా వేధింపులకు లోనవుతున్నామని సింగ్ నుంచి రక్షణ కావాలని దేశం సాక్షిగా విన్నవించారు. వారిని నయానో భయానో తమ దారిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది కేంద్రం. చివరకు కమిటీని నియమించింది. కానీ ఆ కమిటీ కూడా కేంద్ర సర్కార్ కనుసన్నలలోనే ఉండడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కే మొగ్గు చూపింది. దీనిపై భగ్గుమన్నారు బాధిత మహిళా రెజ్లర్లు(Wrestlers). గత ఏప్రిల్ 23 నుంచి హస్తినలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనను ఉధృతం చేశారు. సింగ్ పై కేసు పెట్టేందుకు కూడా ఢిల్లీ ఖాకీలు ఒప్పుకోలేదు. చివరకు భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటేనే కానీ కదలిక రాలేదు.
చివరకు రెండు కేసులు నమోదయ్యాయి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై. ఇక ఒలింపిక్ సమాఖ్య చీఫ్ గా ఉన్న పీటీ ఉష కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసింది. ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. చివరకు సాగు చట్టాలతో మోదీని తల వంచుకునేలా చేసిన సంయుక్త కిసాన్ మోర్చా సంచలన ప్రకటన చేసింది. తమ ఆడబిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వారికి మద్దతుగా నిలుస్తామంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన పార్లమెంట్ సాక్షిగా మహిళా పంచాయత్ కు పిలుపునిచ్చింది. ఇక కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ మహిళా రెజ్లర్ల గురించి పట్టించు కోవడం మానేశారు. ఆయన ఐపీఎల్ మ్యాచ్ లోను ఎంజాయ్ చేసే పనిలో పడ్డారు. ఇక ఈ దేశంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ మహిళల పట్ల అనుసరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఢిల్లీ సాక్షిగా మహిళా రెజ్లర్లను ఖాకీలు ఈడ్చుకు వెళ్లడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రియాంక గాంధీ, ప్రియాంక చతుర్వేది, కేజ్రీవాల్ , తదితర నేతలంతా తీవ్ర అభ్యంతరం తెలిపారు. అటు కేంద్రాన్ని ఇటు ఖాకీలను తప్పు పట్టారు. తమ అసామన ప్రతిభా పాటవాలతో పతకాలు సాధించి దేశానికి గర్వ కారణంగా నిలిచిన మహిళ క్రీడాకారుల పట్ల వివక్షా పూరితమైన చర్యలు మంచి పద్దతి కాదు. ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలి..పదవిని అంటి పెట్టుకుని నానా హంగామా చేస్తున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను తొలగించాలి. మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలి. లేకపోతే ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉంది.
Also Read : Priyanka Chaturvedi
