MLA KTR : లగచర్ల ఘటనపై చర్లపల్లి జైలు కెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములఖాత్ కానున్నారు...
KTR : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఇవాళ(శనివారం) ఉదయం 11గంటలకు చర్లపల్లి జైలుకు వెళ్లనున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములఖాత్ కానున్నారు. కేటీఆర్‌తో పాటు చర్లపల్లికి మాజీమంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఇతర నేతలు వెళ్లనున్నారు. ములాఖత్ తర్వాత చర్లపల్లి జైలు వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడనున్నారు.
MLA KTR Visits..
కాగా..వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్‌పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేశ్ అని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ దాడి జరిగే సమయానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో పోన్ కాల్ చేసి సురేశ్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి సైతం.. ఓ వైపు సురేశ్‌తో మాట్లాడుతూనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు డీజీపీ ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న సురేశ్‌పై ఇప్పటికే అత్యాచారం కేసుతో సహా వివిధ కేసులు సైతం నమోదయ్యాయి. అయితే గతంలో సురేష్‌పై నమోదు అయిన కేసులను తొలగించేందుకు పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది.
కొండగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామం ఘర్షణల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పేరును కూడా ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో పాటు.. మరికొందరి ఆదేశాలు కూడా ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. నరేందర్ రెడ్డి తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా ప్రజలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. అంతేకాదు.. కొందరికి డబ్బులు ఇచ్చి మరీ దాడికి ఉసిగొల్పారన్నారు. అధికారులను చంపినా పర్వాలేదని.. రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారని పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచరించామని పోలీసులు అన్నారు. నిందితుడు విశాల్‌తో పాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిగా తేలిందని చెప్పారు.
Also Read : Deputy CM Pawan : మహారాష్ట్రలోని తన ప్రచార బలం చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్