Supreme Court: రాహుల్ గాంధీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం
రాహుల్ గాంధీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం
Supreme Court : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని కాంగ్రెస్ నేతను ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం… నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరని వ్యాఖ్యానించింది. రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ… దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని వాదించారు. దీనితో ఆగ్రహించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులో మాట్లాడాలని… సోషల్ మీడియాలో కాదని పేర్కొంది. ఇటువంటి సమస్యలను పార్లమెంటులో ఎందుకు లేవనెత్తరని ప్రశ్నించింది.
Supreme Court Slams Rahul Gandhi
2022లో దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ… పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘2020 జూన్‌లో లడఖ్ లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ సమయంలో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూగాన్ని చైనా స్వాధీనం చేసుకుంది. ఇది దిల్లీ వైశాల్యం కంటే ఎక్కువ. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దాని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగరు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ భూభాగాన్ని తిరిగి ఇవ్వాలంటూ మన సైన్యం చైనా సైన్యంతో చర్చలు జరిపినప్పటికీ ప్రధాని మోదీ ఈ విషయంలో అబద్ధాలు చెబుతున్నారు.. ఆక్రమణే జరగలేదంటున్నారు. దీని గురించి దేశ మీడియా ప్రశ్నించడం లేదు. ఇది నిజం కాదా..? ఇదంతా యావత్ దేశం గమనిస్తోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాహుల్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దేశ సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ 2022లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేశారు.
చైనాకు క్లీన్చిట్ ఎందుకు ఇచ్చారు – కేంద్రానికి జైరాం రమేష్ సూటి ప్రశ్న
చైనాతో భారత సరిహద్దుల నిర్వహణలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ‘డిడీఎల్జే’ (DDLJ) పాలనీని అనుసరిస్తోంది తప్పుపట్టారు. ‘తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్ధించు’ (Deny, Distract, Lie, Justify) అనే విధానాన్ని ఐదేళ్లుగా కేంద్రం అనుసరిస్తోందన్నారు. ప్రజలు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడానికి బదులుగా జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటోందని విమర్శించారు.
2020 జూన్ 15న గల్వాన్‌లో 20 మంది సైనికులు అమరులైనప్పటి నుంచి దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడు అనేక ప్రశ్నలు లేవనెత్తారని అన్నారు. వాటికి జవాబులు చెప్పడానికి బదులు మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా డీడీఎల్జే విధానంతో నిజాన్ని కప్పిపుచ్చుతోందని జైరాం రమేష్ విమర్శించారు. గల్వాన్ లో దేశం కోసం వీరజవాన్లు ప్రాణం త్యాగం చేసిన నాలుగు రోజుల తర్వాత 2020 జూన్ 19న చైనాకు ప్రధాన మంత్రి ఎందుకు క్లీన్చిట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని చైనాకు మోదీ క్లీన్ చిట్ ఇచ్చారని జైరాం రమేష్ ఆక్షేపణ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనాకు పాక్ బహిరంగంగా మద్దతు ప్రకటించినా మోదీ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
Also Read : Tejashwi Yadav: ఓటరు కార్డుల వివాదంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పై పోలీసులకు ఫిర్యాదు
