Localbody Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై తేలేది పీఏసీలోనే
స్థానిక సంస్థల ఎన్నికలపై తేలేది పీఏసీలోనే
Localbody Elections: ఈ నెల 16 లేదా 17వ తేదీన పీఏసీ సమావేశం నిర్వహించాలని తొలుత అనుకున్నా వర్షాలు, ఇతర కార్యక్రమాల కారణంగా ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 20 తర్వాత పీఏసీ సమావేశం నిర్వహించాలని పీసీసీ తాజాగా నిర్ణయించింది. ఎన్నికలను (Localbody Elections) ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై పార్టీలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. వెంటనే నిర్వహిస్తే మేలని ఎక్కువ మంది మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. కానీ, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తేలేదాకా ఎన్నికలు నిర్వహించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెజార్టీ నేతల అభిప్రాయం తెలుసుకోవడానికే పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత మెజార్టీ అభిప్రాయం మేరకు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయిస్తారని నేతలు చెబుతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సైతం పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి… ఎన్నికల నిర్వహణపై ఒక నిర్ణయానికి రావాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Localbody Elections – నెలాఖరులోగా మండల కమిటీల ఏర్పాటు
ఈ నెలాఖరులోగా మండల కాంగ్రెస్ (Congress) కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలని తాజాగా నిర్ణయించారు. ఒకవేళ వచ్చే నెలలో ఎన్నికలు జరిగితే ఈ కమిటీలన్నీ చురుగ్గా పనిచేసేలా పార్టీ కోసం కష్టపడేవారిని మాత్రమే నియమించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లకు సూచించారు. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా ఒక్కో జిల్లా నుంచి పేర్ల జాబితాలను వెంటనే పంపాలని సూచించారు. జిల్లాల్లో పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో గుర్తించి ఎంపిక చేయాలని ఇన్‌ఛార్జి మంత్రులకు పీసీసీ సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంలో రెండు వాదనలు ఉన్నమాట వాస్తవమేనని… అందుకే పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని మహేశ్‌కుమార్‌గౌడ్ ‘ఈనాడు’కు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తున్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వర్గాలకు తప్పనిసరిగా 42% వరకూ టికెట్లు కేటాయించాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. రిజర్వేషన్ల అంశం తేలిన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు విన్నవించి… మరింత గడువు కోరాలని ప్రభుత్వానికి సూచిస్తామని ఆయన పేర్కొన్నారు.
Localbody Elections – ప్రజల మనోగతంపై ఆరా
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజల మనోగతాన్ని తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు, ఇన్ఛార్జులను నియమించినందున… వారి ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, పాతవారి మధ్య విభేదాలున్నందున… వారికి సర్దిచెప్పి ఎన్నికలకు సిద్ధం చేయాలని పీసీసీకి ఏఐసీసీ సూచించింది.
Also Read : Minister Bandi Sanjay: ‘మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచేదా ? – మంత్రి బండి సంజయ్
