Jubilee Hills: జూబ్లీహిల్స్ టిక్కెట్టు బరిలో నేను ఉన్నా – మాజీ ఎంపీ
జూబ్లీహిల్స్ టిక్కెట్టు బరిలో నేను ఉన్నా - మాజీ ఎంపీ
Jubilee Hills : మరికొన్ని నెలల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలో విజయం సాధించాలని తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అలాంటి వేళ… మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికలో తాను పోటీలో ఉన్నానని ప్రకటించారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా గతంలో రెండు సార్లు గెలిచినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సదరు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు.
Jubilee Hills MLA Ticket
ప్రత్యేక నిధులు కేటాయించి మరీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. తన సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వాలని… అందులో భాగంగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి కేటాయించాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించిన విషయాన్ని అంజన్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తనకన్నా సీనియర్లు ఎవరూ లేరని… ఈ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల బరిలో దిగేందుకు తనకు అన్ని అర్హతలున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి తనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించి… మంత్రి పదవిని సైతం తనకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. ఇక తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కి యూత్ కాంగ్రెస్ కోటాలో రాజ్యసభకు పార్టీ అగ్రనాయకత్వం పంపిందని వివరించారు. అతడు నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు.
తాను, తన కుమారుడు పారాచూట్ లీడర్లం కాదంటూ కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీలో (Congress) కష్టపడి పని చేశామని చెప్పుకొచ్చారు. కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నానని.. ఆ క్రమంలో తనకు ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిగా కాంగ్రెస్ అవకాశం ఇవ్వాలని అగ్రనాయకత్వానికి కీలక సూచన చేశారు. జూబ్లీహిల్స్‌లో (Jubilee Hills) సర్వే చేస్తే తన పేరు ప్రజల నుంచి వస్తుందంటూ ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
త్వరలో 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు – కేటీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిందని… అలాంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. జోగులాంబ జిల్లా గద్వాలలోని తేరు మైదానంలో నిర్వహించిన ‘గద్వాల గర్జన’ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. గద్వాలను జిల్లా కేంద్రంగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు.
‘‘రైలు కింద తలపెడతాను కానీ, పార్టీ మారబోనని గతంలో కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడేమో అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లు చెప్పారు. ఆయన పార్టీ మారుతున్నది.. నియోజకవర్గ అభివృద్ధి కోసమా..? సొంత అభివృద్ధి కోసమా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయి. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు చాలా సీరియస్‌గా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసురుతున్నా. 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఎన్నికలకు రావాలి. కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. గ్రూప్-1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. రాష్ట్రం దివాళా తీసిందని సీఎం అంటే..ఎవరైనా అప్పు ఇస్తారా? ఇథనాల్ కంపెనీకి వ్యతిరేక పోరాటంలో భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుంది’’ అని కేటీఆర్ అన్నారు.
Also Read : Drugs: హైదరాబాద్ లో పాఠశాలలోనే మత్తు పదార్ధాల తయారీ
