హైదరాబాద్ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. సివిల్స్ పరీక్షలతో పాటు గ్రూప్ –1, గ్రూఫ్–2 కోచింగ్ కోరకు మెరిట్ ఆధారంగా పారదర్శక ఎంపిక విధానం ఉంటుందని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్ల ఒక హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణలోని ప్రతి జిల్లాకు విస్తరించేలా దీర్ఘకాలిక ప్రణాళిక చేస్తామని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
ఎస్సీ యువతలో ఆత్మ విశ్వాసం పెంచే విధంగా మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీల ప్రతినిధిత్వం పెరిగే విధంగా ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్లను అకాడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పారు. తమిళనాడు మోడల్‌లా అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాలు నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు. పేద విద్యార్థి నుంచి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా (పరిపాలకుడి గా ) తీర్చిద్దిదాలనే సంకల్పంతో మా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ . మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఇదే సమయంలో విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవస్థలను బలోపేతం చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం నిధులను కేటాయిస్తోందని అన్నారు.
