హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. పాతబస్తీ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 6,500 గజాల క్రీడా మైదానాన్ని కాపాడింది. దీని విలువ రూ. 100 కోట్ల వరకు వుంటుందని అంచనా. హెచ్ఎండీఏ అనుమతి పొందిన లే అవుట్ లో స్పష్టంగా క్రీడా మైదానం అని పేర్కొన్నా ఆక్రమణలకు తెగబడిన వారికి కూల్చివేతలతో బుద్ధి చెప్పింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్దేవుపల్లి విలేజ్ శాస్త్రిపురం కాలనీలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 188 ఎకరాల హుడా అనుమతి పొందిన లే అవుట్ లో క్రీడాస్థలం కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. జీ ప్లస్ 3 అంతస్తుల నిర్మాణ దశలో ఉన్న భవనాలు ఐదింటిని హైడ్రా తొలగించింది. మరో రెండు సింగిల్ రూమ్ నిర్మాణాలను తొలగించింది. 1800 ల ప్లాట్లకు పైగా ఉన్న ఈ లే అవుట్ ప్రకారం 6500 గజాల స్థలాన్ని ప్లే గ్రౌండ్ కోసం కేటాయించారు.
క్రీడ స్థలానికి కేటాయించిన స్థలం అని తెలిసి కూడా గత 3 సంవత్సరాలుగా నోటరీ మీద స్థానికంగా ఉన్న కబ్జాదారులు ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ గతంలో నోటీసులు కూడా ఇచ్చింది. 2024లో తొలగిస్తామని కూడా ఆర్డర్ ఇచ్చింది. అయినా పట్టించు కోకుండా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇదే విషయమై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా , జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. లే అవుట్ ప్రకారం క్రీడాస్థలం కోసం కేటాయించిందని నిర్ధారణ చేసుకుంది. నిర్మాణాలు చేపట్టవద్దని వెంటనే హైడ్రా హెచ్చరించింది.
వెంటనే రంగంలోకి దిగింది. ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 5 నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు రెండు చిన్న గదులతో నిర్మించిన వాటిని తొలగించింది. ఇంకో రెండు భవనాల్లో ఇప్పటికే నివాసాలు ఉండడంతో వాటిని మినహాయించింది. క్రీడామైదానం అందుబాటులోకి రావడంతో శాస్త్రిపురం కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆక్రమణలు అడ్డుకుంటే భయపెట్టారని.. హైడ్రా రావడంతో క్రీడాస్థలం కాపాడు కోగలిగామని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ కబ్జా చేసిన వాళ్లు సామాన్యులు కాదని.. అడ్డుకున్నవాళ్లను బెదిరించారని వాపోయారు.
