హైదరాబాద్ : బీఆర్ఎస్ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై సీరియస్ అయ్యారు. హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా అంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధి నినాదం మాదని, అవినీతి చరిత్ర నీదంటూ ఏకి పారేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుల్లెట్ దించినా ఇంకా బుద్ది రాలేదన్నారు. మంత్రి కుమార్తె వివాహం కోసం ఖర్చుల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లు నిజం కాదా అని నిలదీశారు. సొంత కుటుంబాన్ని ద్రోహం చేసిన చరిత్ర నీది. నీ స్వార్థం కోసం కన్న తల్లిని సైతం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించావు , ఆ విషయం ఇంకా మరిచి పోలేదన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అమ్ముకున్నది నిజం కాదా అని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వస్తే నీకు పండగే కదా.. రేటు కట్టి మరీ బీఫాంలు అమ్ముకోవడం మీకు అలవాటే కదా అని నిప్పులు చెరిగారు గూడెం మహిపాల్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్లికో కలెక్షన్ ఏజెంట్ పెట్టి వసూలు చేయడం అబద్ధమా అని ప్రశ్నించారు. గత రెండున్నర సంవత్సరాలలో నీ వసూల్ చిట్టా విప్పమంటావా కాటా అంటూ సీరియస్ అయ్యారు. అమీన్పూర్ సర్పంచ్ గా ప్రజలు నమ్మి గెలిపిస్తే.. రెండేళ్లలో రిమూవ్ అయ్యావు.. గుర్తులేదా అని అన్నారు. ఒక సర్పంచ్ పదవిని పూర్తి కాలం పని చేయలేని అసమర్థుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నమ్ముకున్న ప్రజల కోసం వందల ఎకరాలు అమ్ముకున్న చరిత్ర నాది అన్నారు. గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే బహిరంగ విచారణకు సిద్ధం అని ప్రకటించారు.
