అమరావతి : పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ కాలువల ద్వారా తరలించి వాటిని ఏయే అవసరాలకు, ఎంత మేర వినియోగించు కోవాలనే దానిపై ఓ నిర్దుష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపేలా ప్రణాళిక చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ అధికారులతో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు…వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం- నల్లమల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికెపూడిశిల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, జల ధార, జల హారతి కార్యక్రమాలపైనా సమీక్షించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులైన తారక రామ, మహేంద్ర తనయ, తోటపల్లి బ్యారేజ్, మద్దువలస, జంఝావతి, హీరమండలం లిఫ్ట్ పనుల్లో వేగం పెంచాలని సీఎం సూచించారు. డిసెంబర్ నాటికి వంశధార-నాగావళి అనుసంధానం, జూలై నాటికి నాగావళి-చంపావతి అనుసంధానం పూర్తి చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా వంశధార నదిపై నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నేరడి బ్యారేజ్‌కు అడ్డంకులు తొలగడంతో త్వరితగతిన టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. వెలిగొండ స్టేజ్ 1కు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 74 శాతం, టన్నెల్ 2 బెంచింగ్ 94 శాతం, లైనింగ్ 66 శాతం, ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ 84 శాతం, లైనింగ్ 8 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
