ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ 32 డిమాండ్లు ఇవే
కాంగ్రెస్ సర్కార్ మోసంపై భగ్గుమన్న ఆర్టీసీ సిబ్బంది
హైదరాబాద్ : తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మె బాట పట్టింది. కాంగ్రెస్ సర్కార్ పట్టించు కోవడం లేదని, చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు కమిటీ నేతలు. ఆర్టీసీ జేఏసీ మొత్తం 32 డిమాండ్లను సర్కార్ ముందుంచింది. వాటికి సంబంధించి ప్రధాన డిమాండ్లు ఇవే. ప్రభుత్వ మేనిఫెస్టోలో ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులో విలీనం చేసి, ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. బకాయిలను క్లియర్ చేయాలని, 2017 నుంచి అలవెన్సులను పెంచాలి, పదవీ విరమణ చేసిన వారికి చెల్లింపులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
30% ఫిట్మెంట్తో 2021 వేతన సవరణను అమలు చేసి, 2025 సవరణలో సమానత్వాన్ని నిర్ధారించాలని కోరారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలి, కార్పొరేషన్‌ను ఆధునీకరించాలి. వర్క్‌షాప్‌లను బలోపేతం చేయాలి. ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం స్వీకరించి, వార్షిక బడ్జెట్లో 3% కేటాయించాలి. ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలి. ఆర్టీసీ భూములను ప్రైవేట్ ఈవీ ఆపరేటర్లకు అప్పగించడాన్ని ఆపాలి.సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, పీఎఫ్ నిధులను విడుదల చేసి, సీసీఎస్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు టిక్కెట్ల పథకం స్థానంలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టి, బస్సుల రాకపోకల ఫ్రీక్వెన్సీని పెంచాలి. ₹400 కోట్ల నెలవారీ బకాయిలను పూర్తిగా చెల్లించి, ₹2,500 కోట్ల బకాయిలను క్లియర్ చేయాలి.
ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి, ఖాళీలను భర్తీ చేయాలి, పదోన్నతులు కల్పించాలి. వయో పరిమితిని 44 సంవత్సరాలకు పెంచాలి. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లను అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడం నిలిపి వేయాలి. పదవీ విరమణ చేసిన అవుట్సోర్స్ అధికారులను తొలగించాలి. ఉద్యోగులకు ఆసుపత్రి, వైద్య ,పదవీ విరమణ ప్రయోజనాలను మెరుగు పరచాలి. 2019 సమ్మె సమయంలో నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించు కోవాలి. అద్దె బస్సులను , వాటి సిబ్బందిని ఆర్టీసీలో విలీనం చేయాలి. 8 గంటల షిఫ్టులను , ముఖ్యంగా మహిళా సిబ్బందికి మెరుగైన పని పరిస్థితులను అమలు చేయాలి. హైదరాబాద్ సిబ్బందిని జిల్లా పోస్టింగ్‌లలో పని చేయమని బలవంతం చేయడాన్ని ఆపాలి.
