హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులను ఉద్దేశించి బుధవారం స్పందించారు. ఈ ఫలితాలు మీ జీవిత గమనాన్ని శాసించేవి కావు, మీ సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని గుర్తించాలని అన్నారు సజ్జనార్. ఇటీవలి ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం నన్ను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదన్నారు సీపీ. అది మీ కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుందన్నారు.
ఓటమి అనేది గెలుపునకు తొలిమెట్టు కావాలే తప్ప, జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచు కోవాలని హితవు పలికారు సజ్జనార్. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి… మీ ఆశలను, అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురి చేయవద్దని కోరారు. ఫలితం ఏదైనా సరే, మీ పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోండి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి అని పేర్కొన్నారు.మార్కుల కంటే మీ పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు మీకు అత్యంత ముఖ్యం. ఫలితాల తర్వాత పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించండి; వారు ఒంటరిగా ఉన్నా, మౌనంగా ఉన్నా వారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పండి. అవసరమైతే మీ పనులన్నీ పక్కన పెట్టి, ఒక రోజంతా వారితో గడిపి, వారి మనసులోని భయాన్ని పోగొట్టాలని కోరారు.
ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, ఫెయిల్యూర్ అనేది తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయని భరోసా కల్పించాలన్నారు. చదువులో వెనుకబడిన ఎందరో వ్యక్తులు పట్టుదలతో శ్రమించి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి చేరుకున్నారన్న నిజాన్ని ఎవరూ మరువవద్దన్నారు. పరీక్షల కంటే ప్రాణం గొప్పది, మీ వెనుక ఒక కుటుంబం ఉందని, మీ కోసం వారు తపిస్తున్నారని ఆలోచించాలని అన్నారు సజ్జనార్. ఏ చిన్న ఆందోళన కలిగినా మీ తల్లిదండ్రులతో లేదా ఆత్మీయులతో పంచుకోండి. ప్రతికూల ఫలితాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు సీపీ.
