హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ గా సివి ఆనంద్ నియమితులయ్యారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లైన్ క్లియర్ చేసింది. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆనంద్ గతంలో హైదరాబాద్, విజయవాడ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం హోమ్ సెక్రటరీగా ఉన్న ఆనంద్ ను నూతన డిజిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న గురువారం పదవీ విరమణ చేయనున్నారు. డీజీపీ పోస్టు కోసం పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఉన్నత స్థాయి పోలీసు యంత్రాంగంలో జరిగిన భారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారిగా సీవీ ఆనంద్ గుర్తింపు పొందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వుల్వు జారీ చేసింది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఆనంద్ మే మొదటి వారంలో తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. సీవీ ఆనంద్ వివిధ హోదాలలో విధులు నిర్వహించారు. ఆయనకు టెక్నాలజీపై మంచి పట్టుంది. డీజీపీగా నియామకం అయ్యే కంటే ముందు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. హోం శాఖలో ఆనంద్ స్థానంలో శిఖా గోయల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా రాష్ట్ర అత్యున్నత పోలీసు పదవికి ఆనంద్ పదోన్నతి పొందేందుకు మార్గం సుగమం చేసింది. ఇక సీవీ ఆనంద్ పూర్తి పేరు చింతకుంట వెంకట ఆనంద్. తను 1962లో పుట్టాడు. 1991లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ఆఫీసర్.
