తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి
సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర డీజీపీ గా ఉన్న శివధర్ రెడ్డికి మరో అత్యున్నతమైన పదవిని కట్టబెట్టింది. ఏప్రిల్ 30న గురువారం నాటితో ఆయన డీజీపీగా పదవీ విరమణ చేయనున్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండానే సీఎం ఎ. రేవంత్ రెడ్డి శివధర్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టారు. ఇప్పటికే కీలకమైన పదవులను నిర్వహించారు తన సుదీర్ఘ కెరీర్ లో. ఇక శివధర్ రెడ్డి స్వస్థలం రెంగా రెడ్డి జిల్లా . తాజాగా సీఎం సిఫారసుతో శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించారు. ఆయన చీఫ్ సెక్రటరీ హోదా పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొంది.
ఇక శివధర్ రెడ్డి ది 1994వ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఉస్మానియా యూనిర్శిటీలో లా చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శివధర్ రెడ్డికి కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగంకు చీఫ్ గా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్. అంతకు ముందు శివధర్ రెడ్డి పలు జిల్లాల్లో ఎస్పీగా సేవలు అందించారు. గతంలో తను వృత్తిలో భాగంగా నల్లగొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్ జిల్లాల్లో పని చేశారు. డీసీపీ ట్రాఫిక్, డీసీపీ సౌత్ జోన్ కు పని చేశారు. అంతే కాకుండా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా కూడా విధులు నిర్వహించారు. ఆయన పనితీరు ఆధారంగా గత ఏడాది సెప్టెంబర్ 26న రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు.
2016లో గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించారు శివధర్ రెడ్డి. ఇంటెలిజెన్స్ విభాగంలో ముఖ్యమైన సేవలు అందించారు. ఐక్య రాజ్య సమితి పీస్ మిషన్ లో పాల్గొన్నారు. పలు అవార్డులు, పురస్కారలు పొందారు. కెరీర్ పరంగా 30 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు.
